Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల భూములపై సర్కార్ కన్ను
- ప్రభుత్వ ఖజానాకు రూ.1500 కోట్లు రాబట్టే యత్నం
- ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల నుంచి 106 ఎకరాల భూమి సేకరణ
- ఈ నేలనే నమ్ముకుని బతుకుతున్నాం ఇవ్వబోమని రైతుల స్పష్టం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'సర్కార్ ఖాజానా నింపుకోవడానికి.. మా కడుపు కొడుతోంది. మా తాత, తండ్రుల కాలం నుంచి గీ భూములనే సాగు చేసుకుని బతుకున్నాం. గిప్పుడు సర్కారోళ్లు వచ్చి, ఈ భూమి ప్రభుత్వానికి ఇచ్చేయల్నే.. ఈ భూమిలతో మీకు ఎలాంటి సంబంధం లేదంటూ మాపై జులుం చేస్తుండ్రు. మా నోటికాడి బుక్కను గుంజుకుంటే ఎట్టా..? ప్రభుత్వం సొమ్ము చేసుకోవడానికి మా భూములే దొరికాయా.. పైస, పైస కూడబెట్టుకుని భూములు చదును చేసుకుని సాగు చేస్తున్నాం. ఉన్న ఫలంగా ప్రభుత్వం భూములు ఇవ్వమంటే ఎట్లిచ్చేది? మేమెట్టా బతికేది.. పిల్లజెల్లలను ఎట్ట సాకేది. మా నుంచి ఎకరాల కొద్ది లాక్కొని.. గజాల్లో ఇస్తామంటే ఊరుకునేది లేదు. సెంటు భూమి కూడా వదులుకోం..' అని గుర్రంగూడలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు కోల్పోతున్న రైతులు 'నవతెలంగాణ'తో తమ గోడును వెల్లబోసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నో భూ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వాలు పేదలకు భూములు అసైన్డ్ చేశాయి. అయితే, ఆ భూములపై ప్రస్తుత పాలకుల దృష్టి పడింది. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి.. పేదల భూముల్లో ప్రభుత్వం పాగా వేసి, అమ్ముకోవడానికి సిద్ధపడుతోంది. ఇటీవల జిల్లాలో కోకాపేట ప్రాంతంలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలను కాజేసి హెచ్ఎమ్డీఏ ల్యాండ్ పూలింగ్ పేరుతో వందల ఎకరాలు వేలం వేసి రూ.కోట్లు పోగేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలాపూర్ మండలం గుర్రంగూడ, నాదర్గూల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 92లో పేదలకు అసైన్డ్ చేసిన 170 ఎకరాల్లో నుంచి 106 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం రెవెన్యూ అధికారులు సర్వేలు చేపడుతున్నారు. నాదర్గూల్ రెవెన్యూ పరిధిలోని 92 సర్వే నెంబర్లో సుమారు 200 ఎకరాల భూమి ఉన్నది. 1960-65లో ఆనాటి ప్రభుత్వం 100 కుటుంబాలకు 170 ఎకరాలు పంపిణీ చేసింది. ఆ కుటుంబాలు ప్రస్తుతం 300 కుటుంబాలు అయ్యాయి. ఇందులో ఎక్కువ మంది ఈ భూమినే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం రైతులు కూరగాయలు సాగు చేశారు. ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రస్తుతం ఇక్కడ ఎకరం ధర రూ.15 కోట్లు పలుకుతోంది. అయితే, ఆ భూములపై సర్కారు కన్నేసింది. ప్రస్తుతం 170 ఎకరాల్లో 64 ఎకరాలు రైతులపై పట్టా భూమి ఉంది. మిగిలిన 106 ఎకరాల్లో ప్రభుత్వం హెచ్ఎమ్డీఏ నేతృత్వంలో ల్యాండ్ పూలింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో రూ.1500 కోట్లు టార్గెట్గా తీసుకుని రైతుల భూముల్లో వెంచర్ వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల రెవెన్యూ అధికారులు, ఆర్డీవో స్థాయి అధికారులు రైతులతో మాట్లాడి ఈ భూములు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని బెదిరించారు. ఇందుకు పరిహారంగా ఎకరాకు 500 గజాల స్థలం ఇస్తామని అల్టిమేట్ జారీ చేసినట్టు రైతులు చెబుతున్నారు. వారు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇక్కడ వెంచర్ వేసి, ప్లాట్ వేయడం ఖాయమని.. రైతులు ఎవరూ పంటలు సాగు చేయొద్దని హెచ్చరించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
సర్కారు దగ్గర డబ్బుల్లేవంటా.. మా భూములు అమ్ముకుంటుంది
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటా.. మా భూములు వేలం వేసితే వచ్చిన డబ్బులతో సర్కారు నడుస్తాదంటా. నా పేరున 2 ఎకరాలు ఉంది. ఈ భూమి తీసుకుని 500 గజాలు ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ భూములు ఎన్నటికీి మీ పేరున పట్టాలు కావు, సర్కారు ఇచ్చే 500 గజాల స్థలం తీసుకుని వదిలేయమంటున్నారు. ఈ భూములు పోతే బతికేదెట్టో అర్థం కావడం లేదు.
- రైతు సత్తిరెడ్డి, గుర్రంగూడ
పేదోళ్ల భూములే కావాల్సి వచ్చిందా?
కాయ కష్టం చేసి రూపాయి.. రూపాయి కూడబెట్టి బీడు భూములను పంట భూములుగా తయారు చేసుకున్నాం. ఈ భూములే మాకు జీవనాధారం. సర్కారోళ్లు వచ్చి ఈ భూములు మావి అంటున్నారు. మా తాత, తండ్రుల నుంచి గీ భూములను నమ్ముకుని బతుకుతున్నాం. ఈ భూములు ఇచ్చేదే లేదు. ప్రభుత్వం ఇచ్చే 500 గజాల స్థలంతో కుటుంబాన్ని సాకేదెట్లా.
- మహిళా రైతు సత్తమ్మ, గుర్రంగూడ