Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి రావాల్సిన నిధులేవి...
- ఏం చేశారని హైదరాబాద్లో మోడీ సభ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'విభజన హామీలు ఏమయ్యాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులేవి?. రాష్ట్రానికి ఏం చేశారని హైదరాబాద్లో ప్రధాని మోడీ సభ నిర్వహిస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి'అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేసి, విభజన హామీలను అమలు చేయాలని మోడీ సర్కార్ను డిమాండ్ చేశారు. విభజన హామీలైన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, నిమ్జ్లను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ అతీగతి లేదని తెలిపారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన పథకాలకు నిధులతో పాటు, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన నిధులనూ ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి వేలాది ఎకరాల భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రాష్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి, మాటలకే పరిమితమవుతున్నారు తప్ప, జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. నరేంద్రమోడీ హైదరాబాద్లో సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానిక తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.