Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ రాగానే ప్రధాని మోడీ ట్వీట్
- బేగంపేటలో స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి తలసాని
- బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన ఆ పార్టీ అధ్యక్షులు నడ్డా, పీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, ఆ పార్టీ నేతలు విజయశాంతి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి ఘనంగా స్వాగతం పలి కారు. బేగంపేట నుంచి నేరుగా హెచ్ఐసీసీ నోవాటెల్‌కు ప్రధాని చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకోగానే 'డైనమిక్ సిటీ హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చాను. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తాం' అని మోడీ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి రాక నేపథ్యంలో నోవాటెల్ వద్ద ఐదంచెల భద్రతతో పాటు కేంద్ర ప్రత్యేక బలగాలు ప్రత్యేక పహారా కాస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆ పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నడ్డా, ప్రధాని మోడీ ప్రారంభించారు. నడ్డా అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రధాని మోడీని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సత్కరించారు. నడ్డాను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, డీకే అరుణ, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సమావేశాలకు 18 రాష్ట్రాల సీఎంలు, 348 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాల ముగింపు సందేశాన్ని ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీ ఇవ్వనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, బీజేపీ అధికారంలోని రాష్ట్రాల్లో పాగావేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, త్వరలో జరుగనున్న ఆయా రాష్ట్రాల శాసనసభ స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.