Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల సేవలో కేంద్ర ప్రభుత్వం : ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా
- ఐసీఈయూ కరీంనగర్ డివిజన్ మహాసభ ప్రారంభం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మతం పేరుతో మనుషుల్ని విడగొట్టే బీజేపీని తరిమికొట్టాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా పిలుపునిచ్చారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ 26వ మహాసభ శనివారం స్థానిక కొండ సత్యలక్ష్మి గార్డెన్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులు కలగలిసిన గొప్ప సెక్యులర్ దేశంలో బీజేపీ మతం పేరుతో విద్వేషాన్ని రగిలిస్తూ మనుషుల్ని విభజిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరుని బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేయడం లాంటి జుమ్లా హామీలతో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం 8ఏండ్ల పాలనలో దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని చెప్పారు. 'బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టు డు బిజినెస్' అనే మూర్ఖపు ఆలోచనతో సామాన్య ప్రజల, కార్మికుల, కర్షకుల సంక్షేమం గాలికి వదిలేసి కార్పొరేట్ల సేవలో కేంద్ర ప్రభుత్వం తరిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సార్వత్రిక సమ్మెలలో 25కోట్ల మందికిపైగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని పోరాడితే పట్టించుకోలేదని విమర్శించారు.
నిత్యావసరాల వస్తువుల ధరల నియంత్రణ కరువైందని, ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ధరలు పెరగడంతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తదనంతర పరిణామాలతో వేలాది మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారని చెప్పారు. దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు లేక నిరుద్యోగం అత్యధికంగా 8.5 శాతానికి చేరుకుందన్నారు.
రోడ్డుమీద పకోడి వేసుకుని జీవనం సాగించే వాళ్లు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఉపాధి కిందికే వస్తుందని స్వయంగా ప్రధాని చెప్పడం విమర్శలకు దారి తీసిందన్నారు. ఒకవైపు సామాన్యుల జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయికి చేరితే.. ఇదే కాలంలో మోడీ దత్తపుత్రుడు అదాని ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడని చెప్పారు. అదాని కోసమే ప్రధాని అనేంతగా విధానం మారిపోయిందని విమర్శించారు. ఈ ప్రజా, ఉద్యోగ, కార్మిక, కర్షక వ్యతిరేక ప్రభుత్వాన్ని తిరస్కరించేందుకు 26వ మహాసభ నిర్ణయం తీసుకుంటుందని, ఆ దిశలో పోరాడుతునందని అన్నారు.
జాతీయ అధ్యక్షుడు వీ.రమేష్ మాట్లాడుతూ.. పరమత సహనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశ ఔన్నత్యాన్ని మోడీ ప్రభుత్వం పాతాళా నికి తొక్కి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశం, ఒక మతం, ఒక పార్టీ అన్న సిద్ధాంతాన్ని అమలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తమ శక్తి యుక్తులను వినియోగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తగా కారుచౌకగా అమ్మడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వనుందని వాపో యారు. సైన్యంలో కూడా నాలుగు సంవత్సరాల కోసం నియామకాలు చేపట్టే వివాదాస్పదమైన అగ్ని పథ్ తీసుకొచ్చిందన్నారు. జోనల్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ఆర్థిక కార్యదర్శి శ్రీనివాసన్, సహాయ ఆర్థిక కార్యదర్శి రాజేష్ సింగ్ మాట్లాడారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి.రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా, ఆర్.వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా ఎన్ని కయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఏ.రామ్మోహన్రావు, సం యుక్త కార్యదర్శులుగా వి.వామన్‌రావు, డి.సూర్యకళ, ఆర్థిక కార్యదర్శిగా పి.బసవేశ్వర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డివిజన్లో ఉన్న 13 బ్రాంచ్‌ల నుంచి దాదాపు 300 మంది యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.