Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ ప్రయివేటు లిమిటెడ్‌కు సంబంధించిన వివాదంలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ గ్రామంలోని హేచరీస్‌లో ఉన్న భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంటూ మండల తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై ఈటల భార్య జమున, కుమారుడు నితిన్‌రెడ్డి దాఖలు చేసిన రిట్లను శుక్రవారం జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ విచారించారు. సర్వే నెంబరు 130లో చాలా భూమి ఉన్నప్పటికీ మూడెకరాల విషయంలోనే పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్నారంటూ హైకోర్టు పేర్కొంది. తాము తుది ఉత్తర్వులను వెలువరించే వరకూ ఆ మూడెకరాల విషయంలో అధికారులు జోక్యం చేసుకోరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ తర్వాత రికార్డుల్లో సత్యనారాయణరావు అనే రైతు పేరును నమోదు చేశారనీ, అతని నుంచి నితిన్‌రెడ్డి మూడెకరాలను 2018లో కొన్నారని అధికారులు కోర్టుకు వివరించారు. అదిప్పుడు అసైన్డ్ భూమని వారు తెలపటంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారని కోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ వాదనలు కూడా విన్నాక తుది తీర్పును వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి ఉత్తర్వులను జారీ చేసేంత వరకూ పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తిన మూడెకరాల విషయంలో అధికారులు ఏవిధంగానూ జోక్యం చేసుకోరాదంటూ ఆదేశించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.