Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ టెండర్ పక్రియను రద్దు చేయాలి: సీఎం కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మన ఊరు-మన బడి' 'మన బస్తీ-మన బడి' పథకంలో భాగంగా మొత్తం కాంట్రాక్టులు బడా సంస్థలకు ఏకపక్షంగా అప్పజెప్పడం సరికాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద పారిశ్రామికవేత్తలను తిరస్కరించటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా పతన స్థాయికి చేరిందని తెలిపారు. ఏ పాఠశాలలో కూడా కనీస వసతులు లేవని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బోజగుట్ట బస్తీలో ఉన్న పాఠశాలను సందర్శించాననీ, ఇక్కడి అంగన్వాడీ కేంద్రంలో కనీసం కరెంటు బల్పుకూడా లేదని తెలిపారు. ప్రాధమిక పాఠశాలలో తరగతి గదులు లేక వరండాలోనే కూర్చొని చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రాలేదని తెలిపారు. ఇలాంటి దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో నెలకొన్నదని పేర్కొన్నారు. ఈ విషయాలను పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి బహుజన సమాజ్ పార్టీ తీసుకొచ్చిందని వివరించారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అయితే ఈ పథకం బడా కాంట్రాక్టర్లకు భోజ్యంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం, పాఠశాలల బాగును దృష్టిలో పెట్టుకుని ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పనులను అర్హులైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు అప్పజెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులను విచారించి సస్పెండ్ చేయాలని కోరారు.గతంలో ఉప ముఖ్యమంత్రిని బర్తరప్ చేసినట్టుగా, విద్యాశాఖ మంత్రిని భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.