Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూణ్నెళ్లుగా వేతనాల కోసం కాంట్రాక్టు అధ్యాపకుల అవస్థ
- అధికారుల నిర్లక్ష్యంతో ఆర్థిక ఇబ్బందులు
- వెంటనే చెల్లించాలంటూ టీఎస్‌జీసీసీఎల్‌ఏ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఏమోగానీ జీతాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూణ్నెళ్లుగా వేతనాల్లేక మానసికంగా, ఆర్థికంగా సతమతమవుతున్నారు. ఇంటర్ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో అప్పులపాలవుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన జీతాలు అందలేదు. ఐదారు జిల్లాల్లో మాత్రం ఏప్రిల్ జీతం చెల్లించారు. మిగిలిన జిల్లాల్లో మూణ్నెళ్ల నుంచి జీతాలు రాక ఆవేదనకు గురవుతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, అనారోగ్యమైతే ఆస్పత్రి ఖర్చులు, ఇంటి నిర్వహణ వంటి వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి నాలుగు నెలలు గడిచిపోయాయి. ఆ ప్రక్రియ ఇంకా కొన సాగుతూనే ఉన్నది. క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించలేదు. గతనెలలో కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇద్దరు కాంట్రాక్టు అధ్యాపకులు అనారోగ్య కారణంతో రెగ్యులరైజ్ కాకుండానే అర్థాంతరంగా మరణించారు. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధపడినా కొందరు అధికారులు మాత్రం కాలయాపన చేస్తుండడం గమనార్హం. అధికారుల తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, అధికార ప్రతినిధి సయ్యద్ జబీ శనివారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. జీతాలు రాకపోవడంతో పండుగలు చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలవుతున్నామనీ, వడ్డీలు చెల్లించుకోలేక పోతున్నామని తెలిపారు. ఇటీవల ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆయా శాఖల్లోని ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి నిర్ణీత సమయానికి ఏనెలకు ఆనెల జీతాలివ్వాలంటూ అధికారులను ఆదేశించడంపై హర్షిం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకూ ప్రతినెలా జీతాలిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూణ్నెళ్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. అధికారులు స్పందించి తక్షణమే బడ్జెట్‌ను విడుదల చేయాలని సూచించారు. రెగ్యులరైజేషన్ కోసం జాబితాను వెంటనే ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు.