Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాంచి - జంషెడ్పూర్ హైవే నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
రాంచీ - జంషెడ్పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.96.21కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. హైవే నిర్మాణం కోసం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని కన్సార్టియం నుంచి రూ.1030 కోట్ల రుణం తీసుకుని కంపెనీ డైరెక్టర్లు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ నిర్ధారించింది. మధుకాన్ కంపెనీల చైర్మన్ నామా నాగేశ్వరరావుతో పాటు కంపెనీ డైరెక్టర్లు కమ్మ శ్రీనివాసరావు, నామా సీతయ్య, నామా పృథ్విరాజ్ ఇళ్లల్లో సోదాల సందర్భంగా లభించిన డాక్యుమెంట్లు, ఫోరెన్సిక్ ఆడిటర్ల విచారణ నివేదికల ఆధారంగా రూ.361కోట్లను దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. లెండర్స్ ఇండిపెండెంట్ ఇంజినీర్ నియామకంలో కూడా కంపెనీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. మోసపూరిత వైఖరితో మొదటి నుంచి వ్యవహరించిన మధుకాన్ కంపెనీ.. ఉద్దేశ్యపూర్వకంగానే మోసానికి పాల్పడిందని ఈడీ స్పష్టంచేసింది. హైదరాబాద్‌లో 88.85కోట్ల ఆస్తులు, విశాఖ,ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 7.36 కోట్ల ఆస్తులతో పాటు మధుకాన్ షేర్లను అటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఎన్‌హెచ్ 33 పరిధిలో రాంచీ - జంషెడ్పూర్ మధ్య 163కిలోమీటర్ల వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మధుకాన్ కంపెనీకి చెందిన రాంకీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ టెండర్ దక్కించుకుంది. కెనరా బ్యాంకు కన్సార్టియంలో వివిధ బ్యాంకుల నుంచి రూ.1030 కోట్లు రుణాలు తీసుకున్నారు. నిర్ధిష్ట కాలంలో పనులు పూర్తిచేయకపోవడంతో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ 2019 మార్చి 12న కేసు నమోదు చేసింది. 2020 డిసెంబర్30న ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేసు దర్యాప్తును ఈడీ చేపట్టింది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన ఈడీ కీలక సమాచారం సేకరించింది. నిధులను దారిమళ్లించి బ్యాంకులను మోసం చేయలనే ఉద్దేశ్యంతోనే రాంకీ ఎక్స్‌ప్రెస్ వే కంపెనీ ప్రారంభించారని పక్కా సాక్ష్యాధారాలను ఈడీ సేకరించింది. ఇందుకోసం ఉషా ప్రాజెక్ట్స్, బిఆర్ విజన్స్, శ్రీ ధర్మ కన్స్ట్రక్షన్స్, నాగేందర్ కన్స్ట్రక్షన్స్, రాగిణి ఇన్ ఫ్రా, వరలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అనే నకిలీ కంపెనీలను సృష్టించి హైవే నిర్మాణం కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను ఆ కంపెనీల ద్వారా తిరిగి మధుకాన్ ఖాతాలకు మళ్లించారని ఈడీ గుర్తించింది.