Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు ఉల్లంఘిస్తే బండకేసి కొడతా : రేవంత్
- అది అనడానికి నువ్వెవడివి ? : జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్లో చిచ్చు పెట్టింది. ఆయన్ను కలిసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదంటూనే... పార్టీ నేతలెవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే బండకేసి కొడతా అంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారంలేపాయి. టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ను కలిసేందుకు వస్తున్న ఆయన్ను కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్ను కలవాలనుకున్నా.. కేసీఆర్ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది లదేని స్పష్టమైన సంకేతాలిచ్చారు. యశ్వంత్ సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. మద్దతిచ్చామని చెప్పారు. అయినా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకెళ్లగా... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ మద్దతు కోసం హైదరాబాద్ వచ్చిన సిన్హాను కలవకూడదని ఏఐసీసీ అనుమతితో నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బండకేసి కొట్టడానికి రేవంత్ ఎవడు? అంటూ ప్రశ్నించారు. రేవంత్, జగ్గారెడ్డి మధ్య జరుగుతున్న పరస్పర వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. వారి మధ్య అభిప్రాయబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.
క్రమశిక్షణను కాపాడేందుకే రేవంత్ వ్యాఖ్యలు : మల్లు రవి
పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకే వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షు లు మల్లు రవి చెప్పారు. పీసీసీ, సీఎల్పీ పార్టీకి రెండు కండ్లలాంటివన్నారు. పార్టీ బలోపేతమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పా రు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగా అలా మాట్లాడటం సరైందికాదని తెలిపారు.