Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ డిమాండ్
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో నెలకొన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకే అగ్నిపథ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ అశోక్ స్టాలిన్, రావి శివరామకృష్ణ విమర్శించారు. దాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ విధానాలు నిరుద్యోగాన్ని పెంచి పోషించేలా ఉన్నాయని విమర్శించారు. దేశానికి సేవ చేసే ఆర్మీ ఉద్యోగమేమైనా తాత్కాలిక ఉపాధి కేంద్రాలా?అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అగ్ని పథ్ వల్ల యువత నిరుత్సాహంతో ఆందోళనలు చేస్తుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించడం, మోడీ హాజరు కావడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే ఆర్మీ నియామకాలకు పాత పద్ధతిని వదిలేసి, కొత్తగా అగ్నిపథ్‌ను తెచ్చిందని అన్నారు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనని చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో మరణించిన దామెర రాకేష్ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ఎన్ శంకర్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు డి రాము, బొనగిరి మహేందర్, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు ఇటికాల రామకృష్ణ, బరిగల వెంకటేష్, మర్రి శ్రీమాన్, గ్యార క్రాంతి తదితరులు పాల్గొన్నారు.