Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస ఆధ్వర్యంలో రేంజ్ కార్యాలయం ఎదుట ధర్నా
- భూముల స్వాధీనం ఆపకుంటే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వ్యకాస జాతీయ కమిటీ సభ్యులు బి.ప్రసాద్ హెచ్చరిక
నవతెలంగాణ-ఇల్లందు
పోడు భూముల్లో అర్బన్ పార్కు పేరుతో అటవీ శాఖ సిబ్బంది మొక్కలు నాటుతుండగా వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం సంజరునగర్ పంచాయతీ సమీపంలోని పోడు భూముల్లో అటవీ శాఖ సిబ్బంది శనివారం మొక్కలు నాటారు. ఈ విషయం తెలియడంతో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి.ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి కిలేటి కిరణ్, దేవులపల్లి యాకయ్య, అవాజ్ జిల్లా నాయకులు నబీ ఆధ్వర్యంలో రైతులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మొక్కలు నాటడాన్ని పోడుదారులతో కలిసి అడ్డుకున్నారు. అనంతరం రేంజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికార పార్టీ అనుయాయుల పోడుభూములు వదిలేసి పేదల అనుభవంలోని 54 ఎకరాల్లో చెట్లు నాటే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డీఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై రేంజర్ ఆఫీసర్‌కు వినతిపత్రం సమర్పించారు. పోడు భూములు, పోడుదారుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొక్కలు నాటుతున్నట్టు రేంజర్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. పోడు హక్కు పట్టాల కోసం ధరకాస్తులు పెట్టుకోమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో వైపు ఫారెస్టు అధికారులను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఇక్కడ ఫారెస్టు బీటు అధికారి, ఎంపీపీ అనుచరులు, పలుకుబడి కలిగిన వారు ఆక్రమించుకున్న పోడు భూములను వదిలేసి గిరిజనేతరుల పేరుతో బెదిరించి ట్రెంచీలు కొట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. గ్రామ పంచాయతీలో పెట్టిన దరఖాస్తులు పరిశీలన చేసి హక్కు పట్టాలు ఇవ్వాలని, రైతుబంధు అమలు చేయాలని, అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి కిలేటి కిరణ్, దేవుల పల్లి యాకయ్య, అవాజ్ జిల్లా నాయకులు నబీ, వాసం రాము, రాందాసు, కృష్ణ మోహన్, శీలం లింగన్న, భద్రయ్య, రామక్రిష్ణ, బేగం శాంత కుమారి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.