Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెయిలైన్ వారిని పరీక్షలకు సన్నద్ధం చేయండి
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంత్రి సబిత సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజ గంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళి కృష్ణ, రాంరెడ్డి కలిశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను మంత్రి అభినందించారు. ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈనెల రోజులపాటు వారి కోసం కొంత చొరవతో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కోరారు. ఆ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ నిబంధనల అంశంపై టీఎస్జీహెచ్ఎంఏ నాయకులు అడిగిన ప్రశ్నకు ప్రాసెస్ జరుగుతున్నదని మంత్రి సమాధానమిచ్చారు.