Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు: సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జగదీష్
నవతెలంగాణ-సంగారెడ్డి
పేద ప్రజలందరూ ఐక్యమై పోరాటాలు చేస్తేనే ఇండ్ల స్థలాలు సాధించుకుంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జగదీష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఇండ్ల స్థలాల పోరాటానికి శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం ఓ వైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ప్రచారం నిర్వహిస్తున్నా.. జిల్లాలో ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ప్రచారం చేస్తున్నా ఇప్పటి వరకు 10 వేల ఇండ్లూ పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. పట్టణాల్లో విపరీతంగా జనాభా పెరుగుతున్నా, వారికి తగిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అనేకమంది కిరాయి ఇండ్లల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గతంలో పోరాటాలు నిర్వహించి ఇండ్ల స్థలాలు సాధించుకున్న చరిత్ర సదాశివపేటకు ఉందన్నారు. పట్టణంలోని పేదలందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని పేదలందరూ ఐకమత్యంగా పట్టుదలతో పోరాటాలు నిర్వహించి ఇండ్ల స్థలాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజ్, సదాశివపేట ఏరియా కార్యదర్శి వి.ప్రవీణ్‌కుమార్, నాయకులు రమేష్‌గౌడ్, అనిల్, అశోక్, యాదవ్రెడ్డి, దాసు, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.