Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధించుకోవాలి
- ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
నవతెలంగాణ-కోల్ బెల్ట్
సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు, ఇతర నాలుగు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈనెల 11 నుంచి ఆర్జీ-1 జీఎం ఆఫీస్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఎస్సీఈయూ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య అధ్యక్షతన శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు సొంతింటి కోసం 250 గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను వారికే శాశ్వతంగా ఇవ్వాలని, పాత క్వార్టర్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. మిగతా క్వార్టర్లను కాంట్రాక్టు, రిటైర్డ్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బినామీ పేర్ల మార్పు కోసం వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని, ఆర్ఎల్సీ వద్ద జరిగిన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని అన్నారు. పెర్క్స్ మీద 2011 నుంచి వసూలు చేసిన ఆదాయ పన్నును కార్మికులకు తిరిగి చెల్లించాలని, 190/240 బదిలీ వర్కర్ల హోదాను జనరల్ మజ్దూర్గా మార్చాలని కోరారు. కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుడు సింగరేణి క్వార్టర్ తీసుకోవడం వల్ల హెచ్ఆర్ఏ, మెయింటినెన్స్ రూపంలో కంపెనీకి చెల్లించే డబ్బు సర్వీస్ మొత్తంలో కొన్ని లక్షల రూపాయలు కాగా, రిటైర్ అయిన సందర్భంలో క్వార్టర్ ఖాళీ చేసి ఉత్తచేతులతో బయటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. కార్మికుడు సొంతింటి పథకం కింద రూ.10 లక్షలు, సీఎంపీఎఫ్ నుంచి రూ.10 లక్షలు, బ్యాంకుల ద్వారా రూ.10-20 లక్షలు రుణం తీసుకొని ఇల్లు నిర్మించుకొని సులభ వాయిదాల్లో చెల్లిస్తే ఇల్లు సొంతమవుతుందని, కార్మికుడు లాభపడతాడని వివరించారు. బెల్లంపల్లి ఏరియాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్.. ఖాళీగా ఉన్న 1600 క్వార్టర్లు తమకు కావాలని యాజమాన్యాన్ని ఆదేశించి కార్మికులను బయటకు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం శ్రీరాంపూర్ ఏరియా మహాసభలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. తొలుత ఉదయం షిఫ్టుల్లో కేఎల్పీ గనిలో, ఏరియా వర్క్ షాప్లో, సెకండ్ షిఫ్ట్ సమయంలో కేటీకే-1 గనిలో కంపేటి రాజయ్య ఆధ్వర్యంలో మీటింగులు నిర్వహించారు.