Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ నేతలకు రేవంత్ హెచ్చరిక
- మోడీ ప్రతీ చర్యకు మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ప్లెక్సీల రాజకీయం చేస్తోంది
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్, బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.గతంలో ప్రధాని మోడీ చేస్తున్న ప్రతీ చర్యకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు ప్లెక్సీల రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి కట్టిన బీజేపీ, టీఆర్ఎస్ జెండాలు తొలగించాలంటూ నిరసన తెలిపిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్‌ను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆయన్ను పోలీస్‌స్టేషన్‌లో పరామర్శించినంతరం రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసిన రెండుపార్టీలు చిల్లర రాజకీయాలకు తెర లేపాయని విమర్శించారు. కల్లు కంపౌండ్‌లో కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, రైల్వే కోచ్ ప్యాక్టరీకి చట్టబద్ధమైన హామీ ఇచ్చిందని చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా ఆ హామీల సాధనకు సీఎం కేసీఆర్ ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే...ఆ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు 16 నెలలుగా పోరాడితే కేసీఆర్ అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, పునర్విభజన చట్టం తదితర అంశాలపై మోడీని నిలదీసే అవకాశం ఉన్నప్పటికీ నోరుమోపదలేదన్నారు. సమస్యలపై చర్చించకుండా ఫ్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెచ్చారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్న అవకాశాలను జారవిడిచారని విమర్శించారు. అగ్నిపథ్ విషయంలో జరిగిన కాల్పులు ఎవరు చేశారనే అంశంపై ఇప్పటికీ టీఆర్ఎస్ స్పష్టత చేయలేదని చెప్పారు. వంటలు చేసే యాదమ్మ.. సలాక ఎర్రగా కాల్చి మోడీ, బండి, గుండుకు వాతలు పెట్టాలని సూచించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. మోడీని ప్రధానమంత్రిగా అంగీకరించబోరని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును శంకించిన మోడీకి ఈ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదని హెచ్చరించారు. దేశ ప్రధానే తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనీ, ఇక్కడ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను మొదట కలిస్తే...యశ్వంత్ సిన్హానే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద మరోసారి చిల్లర రాజకీయాలు చేస్తే.. టీఆర్ఎస్ నేతల మెడలకు జెండాలు కడతామని హెచ్చరించారు.