Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకేలో విరసం ఆవిర్భావ సభలో ప్రముఖ రచయిత అల్లం రాజయ్య
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలో ప్రజాస్వామిక పద్ధతులు విఫలం కావడం కారణంగానే ఫాసిజం వచ్చిందని ప్రముఖ రచయిత అల్లం రాజయ్య అభిప్రాయ పడ్డారు. ఇక్కడ సరుకుల వినియోగం తప్పా ఉత్పత్తి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవ రచయిత సంఘం (విరసం) 52వ ఆవిర్భావ సభ, దిగంబర కవి చెరబండరాజు 40వ వర్ధంతి సభ హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. సభలో చెరబండరాజు సమగ్ర సాహిత్యం పుస్తకాలను విరసం వ్యవస్థాపకులు కృష్ణాబాయి ఆవిష్కరించారు. అనంతరం అరసవిల్లి కృష్ణ అధ్యక్షతన 'చెరబండరాజు జీవితం.. వ్యక్తిత్వం' అంశంపై అల్లం రాజయ్య మాట్లాడుతూ.. చెరబండరాజు సాహిత్యం నుంచి రాజకీయాల వైపు, రాజకీయాల నుంచి జైళ్లకు వెళ్లారన్నారు. చెరబండరాజును జైళ్లు సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దాయని తెలిపారు. కవులు.. ప్రజల భావోద్వేగాలను కవితలు, కథలు, నాటికలు, నవలలు తదితర రూపాల్లో ప్రదర్శిస్తారన్నారు. ఆ రోజుల్లో భావోద్వేగాలను ప్రదర్శించడం కూడా వీరోచితమే అని తన అనుభవాలను వివరించారు. గతితార్కిక భౌతిక వాద సిద్ధాంతంలో వర్గపోరాట సైనికుడుగా చెరబండరాజు బతికాడని కొనియాడారు. దిగంబర కవి నగముని మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల తరుపున నిరసన తెలియజేయడానికి మాత్రమే దిగంబర కవిత్వం ప్రారంభించామన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో రాజకీయాలు మార్కెట్‌గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. విరసం నాయకులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ.. చెరబండరాజు జీవించిన కాలంలో ఏ సమస్యలు గురించి చెప్పాడో.. నేటికీ మన సమాజంలో అవే సమస్యలున్నాయన్నారు. దేశంలో మతం పునాదులపై పాలన కొనసాగడం సిగ్గు చేటన్నారు. చెరబండరాజు సాహిత్యానికి మరణం లేదన్నారు. సభలో విరసం హైదరాబాద్ నగర యూనిట్ కన్వీనర్ రాము, వీక్షణం వేణుగోపాల్, సినీనటులు భూపాల్, రుక్మిణి, చెరబండరాజు బంధువులు మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, పద్మ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.