Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగానబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను పార్లమెంటు సాక్షిగా అవమానించిన ప్రధాని మోడీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన ప్రధాని మోడీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని బీజేపీ నాయకులు మోడీకి భజన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పడిందనీ, రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఇసుమంత కూడా లేదన్నారు.
పలువురు కాంగ్రెస్ నేత హౌస్ అరెస్టు
చార్మినార్ వద్ద బాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ప్రధాన నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, నాగరిగారి ప్రీతం తదితరులను అరెస్టు చేశారు.
భట్టితో విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని భట్టి నివాసానికి వెళ్లారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ ఉన్నారు.
ఓబీసీలకు 52 శాతం వాటా కల్పించాలి : కేతూరి వెంకటేష్
రాజ్యాంగబద్ధంగా ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం 52 శాతం వాటా కల్పించాలని ఏఐసీసీ ఓబీసీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే పార్లమెంటులో తక్షణం బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు.