Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెరుగుదల, హక్కుల కోసం దశలవారీగా పోరాటాలు చేయనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని పోస్టల్ యూనియన్ ఆఫీసులో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్, డిపార్ట్మెంట్, కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కొన్నేండ్లుగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ల కొమ్ము కాస్తూ కాంట్రాక్టు కార్మికుల పొట్టగొడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలం సవరించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదన్నారు. చట్టబద్ధమైన హక్కులను కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ఆధికారులు కార్మికులకు అమలు చేకుండా కాంట్రాక్టు కార్మికుల శ్రమను విచ్చలవిడిగా దోచుకోవడం జరుగుతున్నదన్నారు. జీఓ నెంబర్22ని అమలు జరిపితే ప్రతికాంట్రాక్టు కార్మికుడు రూ.22 వేల పొందుతారని తెలిపారు. ప్రతి కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెరుగుదల, కార్మికుల హక్కురక్షణ కోసం జులై, ఆగస్ట్ నెలలో దశలవారీగా ఆదోళన చేయాయాలనీ, సర్వేలు, వినతి పత్రాలు, పరిశ్రమ స్థాయిలో ధర్నాలు, సభలు, తదితర ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్, డిపార్ట్మెంట్ కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బి. మధు, సింగరేణి నాయకులు యర్రగాని కృష్ణయ్య, బీడీఎల్ నాయకులు పి.మురళి, ల్యాబ్స్ యూనియన్ నాయకులు ఎస్.కిషన్, తిరుపతి, ఆయిల్ సెక్టార్ నాయకులు గణేష్, బీఈఎల్ నాయకుల వి. శరకర్, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.