Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల కోసం నిర్మించిన
ఇల్లు ఏడాదిగా నిరుపయోగం
- ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్న తెరాస
- ప్రభుత్వ స్థలాల్లోని గుడిసెలకు
పట్టాలిచ్చి 'డబుల్' ఇండ్లు కట్టించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్
నవతెలంగాణ-మట్టెవాడ
ఐదున్నర ఎకరాల్లో 17 ఏండ్ల కిందట నిర్మించిన సెకండ్ ఫేస్ వాంబే కాలనీలోని ఇండ్లను నిరుపేదలకు వెంటనే కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో సీపీఐ(ఎం) కరీంబాద్ ఏరియా జోన్ కమిటీ సభ్యులు గున్నాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం భట్టుపల్లి గ్రామ శివారు వాంబే కాలనీలో పేదలు వేసుకున్న గుడిసెలను జగదీశ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భట్టుపల్లి రోడ్డులో సర్వేనెంబర్ 438, 445లో 2005లో నిర్మించిన వాంబే ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నా వాటిని పేదలకు కేటాయించకపోవడం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలను రియల్టర్లు, బడాబాబులు ఆక్రమించుకొని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం అదే ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కరీమాబాద్ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలు కిరాయిలు కట్టలేక ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే వాటిపి పట్టించుకోని ప్రభుత్వం బడాబాబులకు వంత పాడుతుందన్నారు. గుమస్తాలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, బిల్డింగ్, బీడీ కార్మికులు కిరాయిలు కట్టలేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నారని వారికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరీమాబాద్ జోన్ కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఎండీ అలంఅబూ, సింగారపు కఋష్ణ, అడువాల అంజయ్య, చీర కవిత, గుండు లక్ష్మి, ఎండీ సలీం, ఎండీ కరీం, యాకమ్మ, అప్పాజీ, అనిత, కందకట్ల పద్మ, బేగం, ఎలుగందుల నరేష్, మాదాసి దివ్య, తదితరులు పాల్గొన్నారు.