Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాదిగలను మోసం చేసిన బీజేపీ
- నిరసన సభలో మంద కృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మీద మూటలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరాపార్కు వరకు శాంతియుత నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం జరిగిన సభకు ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు గణేష్ మాదిగ అధ్యక్షత వహించగా మందకృష్ణ మాట్లాడారు. ఒక్క రూపాయి ఆర్థిక భారం పడని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ప్రధాని ఎందుకు పరిష్కరించటం లేదని ప్రశ్నించారు. ఈ సమస్యనే పరిష్కరించలేని మోడీ పరెడ్ గ్రౌండ్లో జరిగే సభలో ఏం హామీలిస్తారో..వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మీ మోసాలు చెల్లవనీ, మోసాలు గ్రహించే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందని తెలిపారు. బీజేపీ యావత్ మాదిగలను మోసం చేసిందని చెప్పారు. ఆ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దక్షణాది రాష్ట్రాల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై మరో పోరాటానికి సిద్దమవుతు న్నామని తెలిపారు. నీతులు చెప్పే కిషన్‌రెడ్డి, బండి సంజరు, లక్ష్మణ్ అధినాయకత్వంతో మాట్లాడి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. గతంలోనే అన్ని పార్టీల మద్దతు కూడగట్టి లేఖలు కూడా రాయించామని గుర్తుచేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతి సారి ఎన్నికల ప్రణాళికలో వర్గీకరణ అంశం ప్రస్తావిస్తున్నదనీ,..పరిష్కారం మాత్రం చూపటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లయినా సమయం సరిపోవటం లేదా? అని నిలదీశారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి కదా? మా నిరసన కార్యక్రమాల్ని భగం చేయటమేంటి? మీ సభలకు కాపలా కాయటమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షులు ప్రకాశ్‌గౌడ్, రాగిడి సత్యం, తదితరులు మాట్లాడారు.