Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడి పట్టని రైతుకు మేలు చేస్తున్న ప్రభుత్వం
- సన్నకారు రైతులు 38 మందికి...
- ధనిక రైతు ఒక్కడికి అందే సాయం ఒకంతే...!
- ఎకరంలోపు రైతులు 38 మందికి అందే సాయం 13%
- పదెకరాల పైబడిన రైతు ఒక్కరికే అంతమొత్తం 'పెట్టుబడి'
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతుబంధు పథకంలో సన్నకారు రైతులపై సర్కారు వివక్ష కొనసాగుతోంది. ఎకరానికి రూ.5వేల చొప్పున పంట పెట్టుబడి ఇస్తుండటంతో ఎకరం, ఎకరంలోపు ఉన్న రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. కేవలం రూ.5వేల పెట్టుబడి సహాయం సంబంధిత రైతులకు ఏమూలకు సరిపోవడం లేదు. ఎకరం, రెండకరాలు మాత్రమే ఉండటంతో మరికొంత భూముని కౌలుకు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాన్ని బట్టి ఎకరం భూమి కౌలు రూ.10-40వేల వరకూ ఉంది. కనీసం ఎకరం కౌలు మందం కూడా పంటపెట్టుబడి సహాయం అందే పరిస్థితి లేదని సన్నచిన్నకారు రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 38 మంది ఎకరం, ఎకరంలోపు పేద రైతులకు ఇచ్చే పంట పెట్టుబడి మొత్తాన్ని పదెకరాలకు పైబడిన ఒక ధనిక రైతుకు మాత్రమే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఐదెకరాలు, అంతకన్నా లోపు ఉన్న రైతులు 90 మందికి అందుతున్న సాయాన్ని 5 ఎకరాలకు పైబడిన పట్టేదారులు నలుగురు మాత్రమే పుచ్చుకుంటున్నారు. దీన్ని బట్టి పంటపెట్టుబడి సాయంలో ధనిక రైతు భాగస్వామ్యం ముందు పేద రైతు దిగదుడుపే అనడంలో ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. చెమటోడ్చే రైతుకన్నా మేడిపట్టని రైతుకే రైతుబంధు మేలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
90 మంది సన్నకారు రైతుల సాయం..
నలుగురు ధనిక రైతులతో సమానం
ఖమ్మం జిల్లాకు తొమ్మిదో విడత వానాకాలం పెట్టుబడి సహాయంగా 3,23,310 మంది రైతులకు రూ.362.2 కోట్లు మంజూరయింది. దీనిలో ఐదు అంతకన్నా తక్కువ ఎకరాల భూమి ఉన్న రైతులు 2,96,086 మంది ఉండగా వారికి రూ.250.14 కోట్ల పంట పెట్టుబడి సహాయం అందుతోంది. అంటే ఒక ఎకరానికి వచ్చే రూ.5వేలను 90 మంది ఐదు ఎకరాలలోపు రైతులు పంచుకుంటున్నారన్నమాట. అదే ఐదు ఎకరాలకు పైబడిన రైతులు 27,224 మంది ఉంటే వారికి రూ.112.1 కోటి పెట్టుబడిగా విడుదలైంది. ఇక్కడ రూ.5వేలను నలుగురు పంచుకుంటుండగా అక్కడ మాత్రం 90 మంది పంచుకోవాల్సి వస్తోంది. దీన్ని బట్టి రూ.5వేలలో పేద రైతు భాగం రూ.55.55 అయితే ఐదు ఎకరాలకు పైబడిన రైతులు ఒక్కొక్కరికి రూ.1,250 దక్కుతుంది. రైతుబంధు పేద రైతులకన్నా ధనిక రైతులకే మేలు చేస్తుందనేందుకు ఇదే నిదర్శనమని రైతుసంఘాలు లెక్కలు చెబుతున్నాయి. ఇక జిల్లాలో ఎకరం, అంతకన్నా తక్కువగా భూములున్న రైతులు 1,20,249 మందికి రూ.37.68 కోట్లు పెట్టుబడి సాయం మంజూరైంది. పది ఎకరాలకు పైబడిన కేవలం 5,146 మంది రైతులకు ఇంతకన్నా ఎక్కువ రూ.37.91 కోట్లు మంజూరు కావడం గమనార్హం. ఇక్కడ ధనిక రైతు ఒక్కరికి పెట్టుబడి సాయంలో దక్కే వాటా 38 మంది పేద రైతులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. పదెకరాలకు పైబడిన ధనిక రైతుల్లో సగం మంది కూడా పంటలు సాగు చేయడం లేదు. వారి భూములను లక్షల్లో ఉన్న పేద రైతులు కౌలుకు సేద్యం చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒక్కో రైతుకు ఐదు లేక పది ఎకరాల కటాఫ్ పెట్టాలనే డిమాండ్ బలపడుతోంది.
ఐదు ఎకరాలలోపు రైతుకు ఎకరానికి రూ.20వేలు ఇవ్వాలి..
రైతుబంధుతో పేద రైతుకన్నా ధనిక రైతుకే మేలు జరుగుతోంది. వ్యవసాయం కౌలుకు ఇచ్చి పట్టణాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ధనిక రైతులకు రూ.లక్షల్లో రైతుబంధు ఏ కష్టం లేకుండా ఖాతాల్లో పడుతోంది. కాబట్టి రైతుబంధు నిబంధనల్లో మార్పు అవసరం. ఐదు ఎకరాలలోపు రైతులకు ఎకరానికి రూ.20వేల చొప్పున ఇవ్వాలి. ఐదు నుంచి 10 ఎకరాల లోపు రైతుకు రూ.15వేలు, పది ఎకరాల పైబడిన రైతుకు ఇప్పుడిస్తున్నట్టుగా రూ.5వేలు ఇవ్వాలనేది రైతుసంఘం డిమాండ్.
- బొంతు రాంబాబు, తెలంగాణ రైతుసంఘం
ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
మాలాంటి పేదలకు
ఒరిగిందేమీ లేదు...
నాకు 1.30 ఎకరాల భూమి ఉంది. పంట పెట్టుబడి సాయంగా రూ.8వేలు అందాయి. మా భూమిలో పత్తి, మిర్చి సాగు చేస్తాం. పత్తి గింజలకే రూ.2వేల దాక ఖర్చు వచ్చింది. నేను ఒంటరి మహిళను. భూమి దున్నుడు కూళ్లు, గింజల నాటు, గింజలు, ఎరువులకు ఇప్పటికే రూ.15వేలకు పైగా ఖర్చు వచ్చింది. గతేడాది మిర్చి వేస్తే తామర పురుగు వచ్చి పంట తుడ్చిపెట్టుకుపోయింది. నాటి పెట్టుబడి తాలుకూ రూ.లక్ష అప్పైంది. మళ్లీ ఈ ఏడాది పెట్టుబడులు పెట్టాలి. పంట రుణాలు కూడా ఇవ్వట్లేదు. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మూడేండ్ల కిందట ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేరున్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు.
- కాంపాటి సుశీల, ఒంటరి మహిళా రైతు, వెదుళ్లచెర్వు, టీ.పాలెం