Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జాబితా క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆ జాబితాను సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు పంపించినట్టు సమాచారం. ఆమె పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఆ జాబితాను సమర్పిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దస్త్రంపై సంతకం చేసిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నది. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేపడతామంటూ సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చిన విషయం తెలిసింది. 2016, ఫిబ్రవరి 26న జీవోనెంబర్ 16ను విడుదల చేసిన విషయం విదితమే. అందుకనుగుణంగా ఇటీవల అసెంబ్లీలో 11,103 మందిని రెగ్యులరైజ్ చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పటికే డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలు ప్రభుత్వానికి చేరాయి. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,584 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు.