Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన పారిజాత నర్సింహ్మారెడ్డి
- హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీనేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి, ఇద్దరు కార్పొరేటర్లు సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి దంపతులు, బడంగ్పేట్ 20వ డివిజన్ కార్పొరేటర్ సుదర్శన్‌రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగిందన్నారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చిన్న చిన్న పనులు కూడా కాలేదని, పట్టణాలు, నగరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. పట్టణాల్లో సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా టీఆర్ఎస్ లీడర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇంతకాలం టీఆర్ఎస్తో కలిసి పని చేసినా ప్రజా సమస్యలు తీర్చలేదన్నారు. కాంగ్రెస్ పరిపాలనా కాలంలో అనేక ప్రజా పథకాలు తీసుకొచ్చామని, హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకంగా ఉందని చెప్పారు. ఔటర్‌రింగ్ రోడ్, ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్, ఎక్స్‌ప్రెస్ హైవే, ఐటీ పరిశ్రమలు అన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని అన్నారు. టీఆర్ఎస్ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని మహేశ్వరం డివిజన్‌కు సంబంధించిన కార్పొరేటర్లు, మేయర్ పార్టీలో చేరారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అనేక సమస్యలపై మోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రెండు పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని, మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒప్పందం ప్రకారం నడ్చుకుటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను టీిఆర్‌ఎస్ ఎత్తి చూపలేదన్నారు. మోడీ కూడా టీఆర్ఎస్పై ఎటువంటి విమర్శలూ చేయలేదన్నారు. మేయర్ పారిజాతరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లోకి వెళ్లానని, కానీ, అక్కడ స్థానిక సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. స్థానిక సమస్యలను పైవారికి తెలిపే ప్రయత్నం చేసినా అక్కడిదాకా చేరడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే కష్టసాధ్యంగా ఉందని, అందుకోసమే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామని చెప్పారు.