Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అండర్టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పరస్పర బదిలీలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పరస్పర బదిలీల కోసం 2,958 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. వారిలో 1,260 మంది అండర్టేకింగ్ ఇచ్చారు. గతనెల 20న కొందరికి పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అండర్టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల పేర్లు అందులో లేవంటూ పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఈవోల నుంచి మళ్లీ వివరాలు తెప్పించుకున్నారు. సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు మళ్లీ పరస్పర బదిలీలను విద్యాశాఖ చేపట్టింది. 530 మంది వరకు అండర్టేకింగ్ ఇస్తూ దరఖాస్తు చేసినట్టు సమాచారం. వారికి పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో మంగళవారం నాటికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇంకా కొంత మంది ఉపాధ్యాయుల జాబితాను మంగళవారం జారీ చేసే అవకాశమున్నట్టు తెలిసింది. ఉపాధ్యాయుల సీనియార్టీకి సంబంధించి హైకోర్టు తీర్పు ఆధారంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు సీనియార్టీతో కూడిన పరస్పర బదిలీలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న జీవో నెంబర్ 402ను జారీ చేసింది. దానిపై కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో జీవోనెంబర్ 402ను సర్కారు పక్కనపెట్టింది. సీనియార్టీ లేకుండా పరస్పర బదిలీలుంటాయని ఈ ఏడాది ఫిబ్రవరి రెండున జీవోనెంబర్ 21ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.