Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70 ప్రశ్నలకు జవాబులు...
- సగానికే సమాధానాలిచ్చినట్టు సమాచారం
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఫిర్యాదు
- స్పందించని అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నేను 75 ప్రశ్నలకు 70 జవాబులు రాశాను. కానీ రెస్పాన్స్ షీట్లో మాత్రం 36 ప్రశ్నలకే సమాధానాలు రాసినట్టు వస్తున్నది.నా తప్పేం లేదు. అయినా తక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసినట్టు వస్తున్నది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.'అని ఆవుల చరణ్ అన్నారు. 'నేను 75లో 71 ప్రశ్నలకు సమాధానాలు రాశాను. కానీ రెస్పాన్స్ షీట్లో 37 ప్రశ్నలకే సమాధానాలు రాసినట్టు ఉన్నది. నాకు న్యాయం చేయాలి.'అని తలసాని శ్రీవర్ష చెప్పారు.
'నేను 75 ప్రశ్నల్లో 74కు సమాధానాలు ఇచ్చాను. కానీ రెస్పాన్స్ షీట్లో మాత్రం 39 ప్రశ్నలకు జవాబులు రాసినట్టుగా వస్తున్నది. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని కలవాలో అర్థం కావడం లేదు.'అని కొవ్వూరు కశ్యప్ అన్నారు. 'నేను 75 ప్రశ్నలకు 58కే సమాధానాలు రాశారు. కానీ రెస్పాన్స్ షీట్లో 32 ప్రశ్నలకే జవాబులు రాసినట్టు వచ్చింది. దీన్ని పరిశీలించి నాకు న్యాయం చేయాలి.'అని లావూరి రాహుల్ వివరించారు. ఇలా గతనెల 24న హైదరాబాద్లోని జి నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన కొందరు విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఆ రోజు హైదరాబాద్లోని బొగ్గులకుంట, ముసారాంబాగ్లోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదేరోజు జి నారాయణమ్మ కాలేజీలో హాజరైన విద్యార్థులకు ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసినా తక్కువ జవాబులు రాసినట్టు రావడం వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్టీఏకు, జి నారాయణమ్మ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఎంతో కష్టపడి చదివి సమాధానాలు రాస్తే రెస్పాన్స్ సీట్లో అందుకు విరుద్ధంగా కనిపించడంతో వారు లబోదిబోమంటున్నారు. అధికార పార్టీతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి వారి సమస్యను చెప్పుకోవాలని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు విడత పరీక్షలు ఈనెల 21 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఆ విద్యార్థులు మళ్లీ రాయాల్సిన పరిస్థితి దాపురించింది.