Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్‌టీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దీనివల్ల అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలే పరిశ్రమల ఏర్పాటు వల్ల రద్దీ పెరిగి, సమస్యలూ పెరుగుతున్నాయనీ, అందుకే రంగాల వారీగా ప్రత్యేక పారిశ్రామిక పార్కులను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ-ఎఫ్టీసీపీఐ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో పారిశ్రామికరంగంలో ప్రతిభ కనబర్చిన 19 సంస్థలకు ఎక్స్‌లెన్సీ అవార్డుల ప్రదాన కార్యక్రమం సోమవారంనాడిక్కడి హెచ్ఐసీసీలో జరిగింది. మంత్రి కేటీఆర్ దీనికి ముఖ్యఅతిధిగా హాజరై, విజేతలకు అవార్డులు అందచేసి, మాట్లాడారు. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగానే టీ-హబ్‌ను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నట్టు చెప్పారు. దానిలోభాగంగానే నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు విస్తరింపచేశామన్నారు. పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల ప్రోత్సహక నిధులను విడుదలచేస్తామని హామీ ఇచ్చారు. 2014కు ముందు రాష్ట్రంలో పారిశ్రామికరంగ అవస్థలు, స్వరాష్ట్రం తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూనే, అన్నిరంగాలకూ 24/7 కరెంటు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 24 శాతం పెట్టుబడులు తిరిగి ఇక్కడే విస్తరణ పేరుతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారనీ, అది ప్రభుత్వంపైనున్న విశ్వాసమేనని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు సహా అన్నిరంగాల్లో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నదన్నారు. టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వీయ ధృవీకరణ హక్కు వంటి పలు విషయాలను ఆయన సభకు వెల్లడించారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు భాస్కరరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అవార్డుల కమిటీ చైర్మెన్ గౌర శ్రీనివాస్, జ్యూరీ సభ్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కేటగిరిల్లో ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికైన 19 కంపెనీల యజమానులు, ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ అవార్డులను అందచేశారు.
డబుల్ ఇండ్ల పంపిణీ వేగవంతం చేయండి : కేటీఆర్
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో, వాటిని పేదలకి అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల్లో, ఇప్పటి వరకు 60వేలు పూర్తయ్యాయని తెలిపారు. సోమవారం నానక్‌రాం గూడలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తయిన 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారం రోజుల్లో సిద్ధం చేయాలని చెప్పారు. దీనికి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారులు ఎంపిక ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, వెరిఫికేషన్ వంటి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున బందాలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చేవారం మరోసారి ఈ అంశం పైనే సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పటికి ఖచ్చితమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని చెప్పారు.