Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూస్టర్ డోసు కోసం ఎదురుచూపులు
- ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల బూస్టర్ డోసుతో పాటు వ్యాక్సిన్ కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. కరోనా థర్డ్‌వేవ్ తర్వాత అంతా సద్దుమణిగిందని భావించి వ్యాక్సిన్ వేసుకోవడం వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది. గతంలో కరోనా బారిన పడ్డ వారు కూడా తిరిగి ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చనీ, వ్యాక్సిన్ తీసుకున్న వారి విషయంలో కరోనా తీవ్రత తక్కువగా ఉంటున్నదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. బూస్టర్ డోసు విషయంలో మొదటి, రెండు డోసుల మాదిరిగా కాకుండా ప్రభుత్వం వేరుగా నిర్ణయం తీసుకున్నది. ఫస్ట్, సెకెండ్ డోసులను అందరికీ ఉచితంగా ఇచ్చిన సర్కారు బూస్టర్ డోసు విషయంలో మాత్రం పరిమితులు విధించింది. కేవలం 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే ఉచితంగా ఇచ్చి మిగిలిన వారిని ప్రయివేటులో వేయించుకోవాలని చెప్పడంతో గడువు దాటినప్పటికీ చాలా మంది బూస్టర్ డోసుకు దూరంగానే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే విషయంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు బూస్టర్ డోసును అందరికీ ఉచితంగా ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖలు రాశారు. పలుమార్లు కోరారు. అయితే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు.
వ్యాక్సిన్ నిల్వలున్నప్పటికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వ్యాక్సిన్ నిల్వలున్నాయని కేంద్రానికి సూచించారు. ఇప్పటికైనా కేంద్రం అనుమతిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ నాలుగు శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు. ప్రయివేటులో వేయించుకునే ఆర్థిక స్థోమత లేని కారణంగానే చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వేసేందుకు అనుమతించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.