Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల గోడు పట్టని సర్కారు
- నెరవేరని ఇండ్లు, ఇండ్ల స్థలాల కల
- కండ్లు కాయలు కాసేలా పెన్షన్లకోసం ఎదురు చూపు
- ధరల భారంతో అవస్థలు
- ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
- వచ్చే ఎన్నికల వరకు సాగదీసే ఎత్తుగడలో ప్రభుత్వం
- ఉద్యమాలకు సిద్దమవుతున్న మహిళలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మాది కూలి బతుకు. కష్టపడితేనే కడుపు నిండుద్ది. సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం రెండు పడకల ఇండ్లు ఇస్తున్నదంటే దరఖాస్తు చేసుకున్నం. డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కట్టిస్తున్నరు. ఎప్పటి నుంచో వాటి నిర్మాణం జరుగుతున్నది. ఇంకా పూర్తికాలేదంటుండ్రు. అందులో మాకొస్తదో రాదో తెల్వదు. సుమారు మూడు వేల మందికి పైగా ఇండ్లు లేని పేదలున్నరు. ఇక్కడ కట్టేది మాత్రం రెండొందలే.. ఆ నిర్మాణాలు చూసి అందరు ఆశ పడుతున్నరు. లాటరీలో ఎవరు లక్కో..ఎవరు పిక్కో తెల్వదు'.. -ఎస్కె పైముదా.పెద్దపల్లి
'కరోనా తర్వాత ఆడోళ్లకు పనులు దొరకటం మహా కష్టంగా ఉంది. ధరలు భాగా పెరిగినరు. ఉపాధి పని పట్టణంలో కూడా ఉంటే బాగుంటది. కేసీఆర్ సారు కేంద్రంతో మాట్లాడి ఉపాధి పని పెట్టించాలే'.
-షాహిదా బేగం. సంగారెడ్డి
గిరిజన జనమంటే ఈ ప్రభుత్వానికి అసలు శ్రద్ధ లేదు. వర్షాలొస్తే వాగులు పొంగి పొర్లుతుంటాయి. రాకపోకలు సమస్యగా మారుతరు. సరైనా రవాణా సౌకర్యం లేదు. వైద్య సదుపాయాలు లేవు. మరో పక్క వందలాది మంది గిరిజనులు పోడు భూములపై ఆధారపడి బతుకుతున్నారు. వాటికి హక్కు పట్టాలిస్తమని ఇంత వరకు ఇయ్యలేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు కావటం లేదు.
-షెగం కమల. కొమురం భీం జిల్లా.
ఇవన్నీ ఒకరిద్దరి సమస్యలే కాదు..రాష్ట్రంలోని లక్షల మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలివి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసింది. వాటికి ఎనిమిదేండ్లు నిండాయి. అయినా పరిష్కారం కాలేదు. ఇదిగో..అదిగో అంటూ కాలం గడుపుతున్న సర్కారు వైఖరిపై మహిళలు కన్నెర్ర జేస్తున్నారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఓ సర్వే నిర్వహించింది. దీనిలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.
నీడకోసం నినదిస్తున్న పేదలు!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది. కానీ నేటికి ఇవ్వలేదు. పేదోడికి తలదాచుకోవడానికి జానెడు జాగా అడిగితే ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. బంగారు తెలంగాణలో గుడిసెలు ఉండొద్దు భవంతులు కనిపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో చేసిన వాగ్దానం. దాన్ని పాలకులు మరిచిపోయారు. పేదోడి ఇంటి జాగా కొనాలంటే కష్టంగా మారింది. సొంతింటిని నిర్మించుకునే స్థోమత లేక, కిరాయిలు కట్టుకోవడం భారంగా జీవిస్తున్న కుటుంబాలు జాగా కోసం చీమలదండులా కదులుతున్నారు. ఈ స్థితికి కారణం ప్రభుత్వం కాదా? ప్రభుత్వ హామీలు నెరవేరలేదు కాబట్టే పేద జనం ఇంటి స్థలం కోసం నినదిస్తున్నారు. 'అగ్గిపెట్టె అంత ఇండ్లు ఉన్నాయి ఈ పంది గూడు లాంటి కొంపలో కాదు మనం జీవించాల్సింది, మీ అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తా, గుడిసెలు లేని నగరంగా మారుస్తా. ఆ ఇండ్లలో మనం దావత్ చేసుకుందాం' అని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట నీటి మూటగా మారిందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2.91వేల ఇండ్ల నిర్మాణానికి రూ. 19వేల కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు చెబుతున్నది. వాస్తవంగా నేటికీ రూ. 10వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, 90వేల ఇండ్లు మాత్రమే నిర్మించింది. పూర్తి చేసిన ఆ ఇండ్లను పేదలకు, అర్హులకు ఇంతవరకు కేటాయించలేదు. నిర్మించిన కొద్దిపాటి ఇండ్లను చూపి భ్రమల్లో ముంచి, వచ్చే ఎన్నికల వరకు ఈ తంతును ఇలానే కొనసాగుతుందని మహిళలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లేకుంటే ఓట్లేసి అందలమెక్కించిన ఈ ప్రజలే వారిని దింపగలరన్న విషయం గ్రహించాలి.
వడ్డీ బకాయిలు రూ. 4వేల కోట్లు...
డ్వాక్రా గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. వడ్డీలేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలను మూడేండ్లుగా చెల్లించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తీసుకున్న లోన్లపై బ్యాంకు అధికారులు నెలనెల వసూలు చేస్తున్నప్పటికీ..ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులను తిరిగి మహిళలకు చెల్లించటం లేదు. దీంతో ఏటేటా పెరుగుతూ పోయిన బడ్డీ డబ్బులు ఇప్పుడు సుమారు రూ. 4వేల కోట్లకు పేరుకుపోయాయని తెలుస్తున్నది. 2021-22 బడ్జెట్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 3వేల కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2022-23 బడ్జెట్లో రూ. 1,250 కోట్లు కేటాయించినా, ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ( సెర్ప్) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 4,65,705 పొదుపు సంఘాలున్నాయి. వాటిలో 48,88,772మంది సభ్యులున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలో మరో 1,81,225 ఎస్హెచ్జీల్లో మరో 19లక్షల మంది సభ్యులున్నారు.
ఎన్నికలొస్తేనే..
ఎన్నికలొస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా సంఘాలు గుర్తుకొస్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2018లో ఎన్నికలకు వెళ్లడానికి నెల రోజుల ముందు నాలుగేండ్ల వడ్డీ బకాయి కలిపి రూ. 1,900కోట్లను ప్రభుత్వం చెల్లించింది. రెండో సారి అధికారంలోకి వచ్చాక మూడున్నరేండ్లుగా బ్యాంకులకు వడ్డీ జమ చేయటం లేదు. మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప సర్కారుకు వడ్డీ పైసలు జమ చేసే పరిస్థితి కనిపించ బోదని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. మరో పక్క అభయ హస్తం కింద కట్టిన డబ్బులు అందరికీ రాకపోవటంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
సర్కారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయింది. ఇప్పటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. లక్షల సంఖ్యంలో లబ్దిదారులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపచేసి ఏడాదికి 200రోజులు పని కల్పించాలి. రోజుకు రూ.600వేతనం చెల్లించాలి.
- మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి