Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం
- ప్రచార కమిటీ, చేరికల కమిటీ చైర్మెన్ పదవుల్లో ఒకటి అప్పగింత
- నేడు బీజేపీ పదాధికారుల కీలక సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో ఇప్పుడు చర్చంతా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నది. తెలంగాణలో పాగా వేయాలంటే టీఆర్ఎస్ పార్టీ గుట్టంతా అనువణువు తెలిసిన ఈటలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉన్న నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి సుముఖంగా లేనట్టు వినికిడి. ఈ నేపథ్యంలోనే చేరికల కమిటీ చైర్మెన్‌గా, లేదంటే ప్రచార కమిటీ చైర్మెన్‌గా కీలక బాధ్యత అప్పగించే అవకాశమున్నట్టు చర్చ జరుగుతున్నది. వరుసగా కేంద్రంలో రెండుసార్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడమే. రైతుచట్టాలు, దళితులపై దాడులు, కార్మిక కోడ్లు, అగ్నిపథ్పథకం వంటి వాటితో ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్లు తగ్గే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్నాటక మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. కర్నాటక బీజేపీలో నాయకత్వపోరుతో నెలకొన్న అంతర్గత విభేదాలు, తదితర పరిణామాలతో గతం కంటే తక్కువ సీట్లు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిపై ఆ పార్టీ గురిపెట్టింది. ముఖ్యంగా తెలంగాణపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే డబుల్ ఇంజిన్ సర్కారు పల్లవి ఎత్తుకున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆర్థికంగా, రాజకీయంగా భయపెడితే తమవైపు తిరిగే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను గుర్తించే పనిలో పడింది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి కేంద్ర అమిత్‌షా ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వీక్ చేసే ప్రతి అంశానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన ద్వారా సేకరించనట్టు తెలిసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ తెలంగాణలో బీజేపీ బలోపేతంపై చర్చ జరిగే సమయంలో కేంద్ర నాయకత్వం ఈటలతోనే ప్రత్యేకంగా అరగంట పాటు మాట్లాడించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల లోగుట్టు తెలిసిన ఈటలను పావుగా వాడుకుని బలపడాలనే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.