Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి:
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
నవతెలంగాణ-దేవరుప్పుల
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బంద్‌కి లాంటి అమరుల వర్ధంతి, జయంతిను అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పి నేడు మాట మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సోమవారం దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం దొడ్డి కొమరయ్య స్మారక భవనంలో మండల అధ్యక్షులు జీడి ఎల్లయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన కొమరయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం భూస్వాములు, జమీందారులు.. ఆనాటి పాలకవర్గాల నియంతృత్వ వ్యతిరేకతకు చెర్లపల్లి పోరాటం కమ్యూనిస్టులకే సాధ్యమైందన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. పోరాటంలో చనిపోయిన వారిని ప్రభుత్వం గుర్తించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గడీలను, భూస్వాములను కాపాడుకోవడానికి కేసీఆర్ ధరణి వెబ్సైట్ తీసుకొచ్చారని, దాంతో 30, 40 ఏండ్ల కిందట పారిపోయిన భూ జమీందార్లు తిరిగి రావడంతో గడీల పాలన కొనసాగిస్తున్నారన్నారు. నేడు వరంగల్ జక్కలొద్ది భూముల్లో పేదవారు గుడిసెలు వేసుకొని ఇండ్ల స్థలం కావాలంటే భయపెడుతున్నారని విమర్శించారు. హుస్నాబాద్‌లో భూనిర్వాసితులు నష్టపరిహారం ఇవ్వమంటే కేసులు, రిమాండ్, జైలు, బేడీలు వేస్తారా అని ప్రశ్నించారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియాను అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం ఈడీ దాడులు చేయిస్తున్నారన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపై చిత్తశుద్ధి ఉంటే దేశంలో ట్రైబల్స్‌ను కాపాడాలని తెలిపారు. గిరిజనులపై దాడులు, అరాచకాలు అరికట్టాలంటే కమ్యూనిస్టులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఆది సాయన్న, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పాతూరి సుగుణమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చొప్పరి సోమయ్య, రైతు సంఘం నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.