Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం
- రాష్ట్రంలో కనీస వేతనాలు షెడ్యూల్ జీవోలు సవరించాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ- గజ్వేల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాణేబ్రేక్ లైనింగ్ యూనియన్ సీఐటీయూ పదో మహాసభ సోమవారం జరిగింది.
ముందుగా సీనియర్ కార్మికుడు ఏ.సుదర్శన్ సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి అధ్యక్షతన జరిగిన సభలో చుక్కా రాములు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తొలగించి నాలుగు కార్మిక కోడ్లుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ యజమానులకు అనుకూలంగా ఫ్యాక్టరీ చట్టంలో మార్పులు చేస్తూ నూతన కోడ్‌లో చేర్చనుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ,
ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం పేరున కార్మికుల మధ్య ఐక్యతను చీలుస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడి యజమానులను, ప్రభుత్వాలను ఎదిరించాలన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాల జీవోల కాల పరిమితి దాటి పది సంవత్సరాలు గడిచినా సవరించడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలోఉద్యమాలు చేపడతామన్నారు. జిల్లాలో ఈఎస్ఐ డిస్పెన్సరీ, లోకల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ.. అననుకూల కాలంలో రాణేబ్రేక్ పరిశ్రమలో మంచి వేతన ఒప్పందం జరిగిందన్నారు, సీఐటీయూ ద్వారానే కార్మికుల సంక్షేమం సాధ్యమన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా చుక్కా రాములు, అధ్యక్షులుగా జె.మల్లికార్జున్ ఎన్నిక కాగా, అడ్వైజర్‌గా సందబోయిన ఎల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డి.బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా ఎన్.వేణుగోపాల్ ఎన్నికయ్యారు. ఉప ప్రధాన కార్యదర్శిగా బండ్ల స్వామి, డి.కృష్ణ, పి.చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్.నర్సింలు, రంగారెడ్డి, మల్లయ్య, ఎస్.రవికుమార్, ఎండి కుత్బుద్దిన్, వెంకట్రావు, ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, నాయకులు బండ్ల స్వామి, రంగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి , మల్లయ్య, నర్సింలు, కృష్ణ, వెంకట్రావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.