Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర రెండవ మహాసభలో.. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ - ధూల్ పేట్
పాలకులకు మైనారిటీలపై నిర్లక్ష్యం తగదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం రెండవ నగర మహాసభను హుస్సేనీ ఆలం పాల్కీ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్లో నగర ఉపాధ్యక్షులు మొహమ్మద్ కలీముద్దీన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అబ్బాస్ సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనారిటీలు తమ హక్కులకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 20 ఏండ్లుగా ఆవాజ్ మైనారిటీల భద్రత, అభివృద్ధి, లౌకికవాదం నినాదాలతో పని చేస్తోందన్నారు. అనేక సామరస్య కార్యక్రమాలు నిర్వహించి హిందూ, ముస్లిం ఐక్యతను పెంపొందించడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో, దేశంలో పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిందని గుర్తు చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద చర్యలను, వాటిని రెచ్చగొట్టే వారిని ఆవాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. అనంతరం 21 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలో ఉపాధ్యక్షులు ఆయుర్ ఖాన్, విశేష్ రిసెప్షన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ మహమ్మద్ ఇక్బాల్ జావీద్, సోషల్ యాక్టివిస్ట్ నయీముల్లా షరీఫ్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సెల్ కన్వీనర్ మహమ్మద్ సన్నావుల్లా ఖాన్, సీనియర్ అడ్వకేట్ మహమ్మద్ హుద్దూస్గోరీ, సూఫీ ఉమా కౌన్సిల్ అధ్యక్షులు మౌలానా మహమ్మద్ ఖైరుద్దీన్, శ్రామిక మహిళా కన్వీనర్ మీనా, ఏఐఎండబ్ల్యుఏ ప్రెసిడెంట్ సయ్యద్ శంషుద్దీన్ ఖాద్రీ, సోషల్ యాక్టివిస్ట్ మహమ్మద్ అతికుర్ రహ్మాన్, ఇన్సాఫ్ నగర కన్వీనర్ మహమ్మద్ మునీర్ పటేల్, ఐద్వా నగర కార్యదర్శి శశికళ తదితరులు మాట్లాడారు.