Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దొడ్డి కొమరయ్య స్పూర్తితో రైతాంగ సమస్యలపై ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హైదరాబాద్లోని రైతుసంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, దున్నేవాడిదే భూమి కావాలనీ, వెట్టిచాకిరి పోవాలనీ, భూమి, భుక్తి, విముక్తి కోసం దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. జనగామ తాలూకా కడవెండి గ్రామంలో 1946 జులై 4న విసునూరు దేశ్ముఖ్ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ప్రజల ఊరేగింపు సాగిందని చెప్పారు. భూస్వామ్య గూండాలు జరిపిన కాల్పుల్లో తుపాకీ తూటాలకు అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. భూసంస్కరణలను, రక్షిత కౌలు దారి చట్టాన్ని ఈ పోరాటం సాధించిందని గుర్తు చేశారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కౌలు, పోడు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. అభివృద్ధి పేరుతో 2013 భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయకుండా రైతులకు నామమాత్రపు పరిహారమిచ్చి భూములను లాక్కుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.