Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తమైన పోలీసులు.. లోనికెళ్లకుండా అడ్డగింత
- పలువుర్ని అరెస్టు చేసి తరలింపు
- పోలీసు వలయంలో మార్క్స్భవన్
- ర్యాలీగా వెళ్లేందుకు ఎన్డీ కార్యకర్తలు యత్నించగా అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోలీసుల దృష్టినంతా మార్క్స్భవన్పై కేంద్రీకరించేలా చేసిన సీపీఐ(ఎం) న్యూడెమోక్రసీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా ప్రగతిభవన్‌ను ముట్టడించారు. ప్రధాన గేటు వద్ద వరకూ దూసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. తోపులాట జరిగింది. ఎన్డీ కార్యకర్తలందర్నీ పోలీసులు అరెస్టు చేసి పలు పోలీసుస్టేషన్లకు తరలించారు. పోడు భూములకు పట్టాలివ్వాలనీ, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్క్స్ భవన్ నుంచి ఒక్కరు కూడా బయటకు రాకుండా వందలాది మంది పోలీసులు ఉదయం ఐదు గంటల నుంచే అక్కడ పహారా కాశారు. దీంతో న్యూడెమోక్రసీ నేతలు, కార్యకర్తలు ఆ భవనంలోనే ఉండిపోయారు. పోలీసుల దృష్టినంతా తమవైపు ఉండేలా చూశారు. అదే సమయంలో మరో గ్రూపు వ్యూహాత్మకంగా ప్రగతిభవన్‌లోకి వెళ్లే ఎంట్రెన్స్ వరకు దూసుకెళ్లింది. దీంతో అక్కడ మోహరించబడిన పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని అడుగు ముందుకేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్‌లకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్క్స్‌భవన్‌లో ఉన్నవారంతా నిరసన తెలిపేందుకు రోడ్డుపైకొచ్చారు. 'పోడు భూములకు పట్టాలివ్వాలి..అర్హులందరికీ రేషన్ కార్డులివ్వాలి...ప్రజా సమస్యలను పరిష్కరించాలి' అని ప్లకార్డులను ప్రదర్శించారు. నినాదాలు చేశారు. విద్యానగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్తామని పట్టుబట్టారు. దీనికి పోలీసులు నిరాకరించారు. అక్కడున్న ఎన్డీ కార్యకర్తలందర్నీ అరెస్టు చేసి అంబర్‌పేట పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జనార్ధన్, అరుణ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే రెండు రోజుల నుంచి తమ పార్టీ కార్యకర్తలందర్నీ ఎక్కడికక్కడ అరెస్టు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీ క్రియాశీలకంగా పోరాడిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని సహజవనరులను కార్పొరేట్లకు, తాబేదారులకు కేసీఆర్ దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల జారీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాలని కోరారు.