Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సబ్-ఇన్స్పెక్టర్(ఎస్ఐ), కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వీవీ శ్రీనివాస్‌రావు సోమవారం వెల్లడించారు. ఎస్ఐ, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7న, కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 21న రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పోలీసు శాఖలోని ఎస్సైతో పాటు ఫైర్ సర్వీసులు, జైళ్లు, ఎస్పీఎఫ్, పోలీసు కమ్యూనికేషన్లు, రాష్ట్ర రవాణా శాఖ లలోని ఖాళీగా ఉన్న పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ నియామక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే, పోలీసు శాఖలోని కానిస్టేబుళ్లు మొదలుకొని పైన పేర్కొన్న ఇతర శాఖలకు చెందిన కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు కూడా బోర్డు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నది. ఎస్సై, తత్సమాన, కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు పైన పేర్కొన్నది తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్షను నిర్వహిస్తున్నట్టు వీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. అభ్యర్థులు రాత పరీక్ష రాసే కేంద్రాలు హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 40 పట్టణాలలో నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎస్సై, తత్సమాన పోస్టులకు 2,40,000 మంది అభ్యర్థులు, కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు 6,50,000 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఎస్సై అభ్యర్థులు ఈనెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి తమ అధికారిక వెబ్సైట్ డబ్లూడబ్లూడబ్లూ.టీఎస్ఎల్పీఆర్బీ.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.