Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతిసభలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
- ఖమ్మంలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణలో మంత్రి అజరు
నవతెలంగాణ-విలేకరులు
దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు పిలుపునిచ్చారు. సోమవారం దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి, సందర్భంగా పలు జిల్లాల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో కొమురయ్య చిత్రపటానికి ఎం. సాయిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి కోసం దొడ్డి కొమురయ్య చూపిన మార్గాన్ని యువత నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాచలంలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళ్లు అర్పించి, మాట్లాడారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో భూ పోరాటాలు, వర్గ పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పువ్వాడ అజరు కుమార్ దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని సీపీఐ (ఎం) కార్యాలయంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడి నైజాం తుపాకీ తూటాలకు బలై వీర మరణం పొందిన కొమురయ్య స్ఫూర్తితో కార్మికులు పోరాటం చేయాలన్నారు.