Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాని విధానాలపై జెట్ స్పీడుతో యుద్ధం...
- ఆ పార్టీ వైఖరిని ఎండగట్టాలె
- మన అభివృద్ధిని వివరించాలె
- పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
- తక్షణమే అమల్లోకి కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మహారాష్ట్ర తరహా పరిణామాలు తెలంగాణలో పునరావృతమవుతాయి..' 'ఏక్నాథ్ షిండేలాగా టీఆర్ఎస్లో ఎంత మంది షిండే (అసంతృప్తవాదులు)లున్నారో తేెలుస్తాం...' అంటూ బీజేపీ జాతీయ నేతలు వ్యాఖ్యానించిన దరిమిలా సీఎం కేసీఆర్ వారి కామెంట్లపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 'తెలంగాణలో పార్టీని బలోపేతం చేయటమెలాగనే..' అంశంపై కమలం పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. ఇదే సమయంలో మాజీ మంత్రి, బీజేపీలో సీనియర్ అయిన ఈటల రాజేందర్‌తో ఎక్కువ సేపు మాట్లాడించటం ద్వారా గులాబీ పార్టీకి సంబంధించిన 'అనేకాంశాల'ను వారు రాబట్టినట్టు వినికిడి. ఈ నేపథ్యంలో ఆయా విషయాలపై ఆరా తీసిన గులాబీ బాస్... తనదైన శైలిలో స్కెచ్ గీసినట్టు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. దెబ్బకు దెబ్బ అనే రీతిలో బీజేపీకి గుణపాఠం చెప్పాలని ఆయన భావిస్తున్నట్టు ఆయా వర్గాలు వివరించాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి గ్రామ స్థాయి వరకూ బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టటంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిరంతరం ప్రచారం నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా రూపొందించిన కార్యాచరణను తక్షణమే అమలు చేయాలంటూ పార్టీ శ్రేణులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ క్రమంలో అధికార పార్టీ ఇక జట్ స్పీడ్‌తో ముందుకెళ్లనుంది. ప్రతి గ్రామంలోనూ నేతలు విస్తృతంగా పర్యటించనున్నారు. పట్టణాల్లోని డివిజన్లలో సైతం వారు కలియదిరగనున్నారు. ఒక వైపు చేరికలు.. మరోవైపు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించటం.. స్థానిక బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయటం తదితర కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. వీటిని మంగళవారం నుంచే అమలు చేసేలా పార్టీ నిర్ణయించింది. దీంతోపాటు కేంద్రం తెలంగాణ పట్ల అవలంభిస్తున్న విధానాలను సైతం ప్రజాక్షేత్రంలో నిలదీయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిధులపై నిలదీద్దాం...
ఒకవైపు బీజేపీ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి విచ్చేయటం తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు, ప్రతివిమర్శలకు దిగాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తన కార్యవర్గ సమావేశాల్లో నేతలకు దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిగా టీఆర్ఎస్ కూడా పక్కా ప్రణాళికను రూపొందించింది. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన నిధులు, తిరిగి రాష్ట్రానికి రావల్సిన వాటాలో కేంద్రం ఎంతిచ్చిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో వివరిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది.. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి అది ఏం చేసిందో చెప్పాలంటూ కమలం పార్టీని వారు నిలదీయనున్నారు. ఈ అంశంలో ప్రజలను సైతం భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఒక సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు. తద్వారా వారందరూ తమకు మద్దతు తెలిపేలా చర్యలు చేపట్టనున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తేవాలంటే ఇలా క్రియాశీలకంగా పని చేయాల్సిందేననే ఆదేశాలు ఇప్పటికే జారీ అయినట్టు సమాచారం. దీంతోపాటు కేసీఆర్ నిర్వహించిన పలు సర్వేల్లో 'బలహీనంగా ఉన్నారు.. ఈసారి గెలుపు కష్టమనే...' ముద్ర పడ్డ ఎమ్మెల్యేలు... ఇది తమకు సువర్ణావకాశంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీకి... అధికార టీఆర్ఎస్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురు కానుందని ఆ పార్టీకి చెందిన ఒక కార్పొరేషన్ చైర్మెన్ వ్యాఖ్యానించటం గమనార్హం.