Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామిని విస్తరించాలి
- ఆసరా పింఛన్లు లేక అవస్థలు
- అభయ హస్తం నిధులు తక్షణమే విడుదల చేయాలి
- సర్కారు హామీల అమలుకు ఉద్యమం తప్పదు:
ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని రకాల సౌలత్లున్న డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్న కేసీఆర్ వాగ్దానానికి ఎనిమిదేండ్లు నిండాయనీ, ఇప్పటికీ లేనివారికి ఇండ్లు ఇచ్చేందుకు సమయం లేదా? సీఎం సార్..అని పలువురు వక్తలు ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కువద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంఘం అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షత వహించారు. ఐద్వా జాతీయ నాయకులు టి జ్యోతి మాట్లాడుతూ మహిళలకు ఆత్మగౌరవం లక్షలాది మంది మహిళలు తక్షణం ఇండ్ల సమస్య పరిష్కరించాలని ఏకోన్ముఖంగా కోరుతున్నారని తెలిపారు. కనీసం ఉండటానికి వసతులు లేని లక్షలాది మంది అర్జీలు పెట్టుకుంటే..ప్రభుత్వం మాత్రం లక్షా 90వేల ఇండ్లు నిర్మించామని గొప్పగా చెప్పుకుంటున్నదన్నారు. నిర్మాణం జరిగిన ఇండ్లను లబ్దిదారులకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. మహిళలకు ఉపాధి సమస్య కూడా తీవ్రంగా ఉందని చెప్పారు. ఉపాధి హామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరించి, బడ్జెట్లో నిధులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని పేదలు అడుగుతుంటే..ఈ పథకానికి సుమారు రూ. 25వేల కోట్ల నిధులు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కావటం వల్ల కుటుంబాన్ని నిర్వహించటం మహిళలకు సవాలుగా మారిందని చెప్పారు. పేదలకు ఇస్తున్న సబ్సిడీలను ఎత్తేసిన ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం లాభాలు దోచిపెట్టే విధానాలను తీసుకొస్తున్నదన్నారు. కేరళ రాష్ట్రం తరహాలో రేషన్ షాపుల్లో అన్ని రకాలు సరుకులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బియ్యం ఒక్కటిచ్చి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం సరికాదని గుర్తుచేశారు. పింఛన్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా మన డబ్బులను మనం జమ చేసి ప్రభుత్వ ఖాతాలో వేస్తున్నామని చెప్పారు. మన డబ్బులు మనకు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదన్నారు. అభయ హస్తం డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై సర్వేలు నిర్వహించామని చెప్పారు. ప్రభుతం చెబుతున్నట్టు ఏ ఒక్క మహిళా సంతోషంగా లేరని తెలిపారు. ఎక్కడ చూసినా ఇండ్లు, ఇంటి స్థలాల సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎనిమిదేండ్లు అయినా అమలు కాకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. అర్హత కలిగి, దరఖాస్తు చేసుకున్న వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన వాటిని వెంటనే లబ్దిదారులకివ్వాలన్నారు. ఇంటి జాగ ఉన్న వారికి మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర అర్హత కలిగిన వారందరికి పెన్షన్లు ఇవ్వాలన్నారు. అభయం హస్తం నిధులు అన్ని జిల్లాలో లబ్దిదారుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, బి హైమావతి,సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, డి ఇందిర, ఎం వినోద, ఎం భారతి, పి ప్రభావతి, నాగలక్ష్మి, శశికళ, కె గీతారాణి, ఇ ఆహల్య, బి అనురాధ, లక్ష్మమ్మ, రత్నమాల, స్వర్ణలత తదితరులు మాట్లాడారు.