Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రిలో కదం తొక్కిన కామ్రేడ్లు..!
- భారీ ప్రదర్శన, ఐటీడీఏ ముట్టడి
- పోడు సాగుదారులకు అండగా సీపీఐ(ఎం) : మచ్చా
- సమస్యలను పరిష్కరిస్తాం : పీఓ హామీ
పోడు భూములకు పట్టాలివ్వాలని..
నవతెలంగాణ-భద్రాచలం
పోడు భూములకు పట్టాలివ్వాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్, పోలీస్ నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాద్రిలో సీపీఐ(ఎం) కార్యకర్తలు కదం తొక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణ పుర వీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. గిరిజనుల పెద్ద ఎత్తున నినాదాలతో ఐటీడీఏ మారుమోగింది. ఈ సంద ర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పోడు సాగుదారులపైన ఫారెస్ట్, పోలీసు అధికారులు సాగిస్తున్న అరాచకపు దాడులను ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇస్తామని మాయమాటలు చెబుతుందే తప్ప ఆచరణలో మాత్రం వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని విమర్శించారు. గిరిజనులు వేసుకున్న పంటలను నాశనం చేయటం, వారిపై అక్రమ కేసులు బనాయించటం, గిరిజన మహిళలు, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చులకన భావం తోటి అవమానపరిచే విధంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహఱిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి వారి భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే సీపీఐ(ఎం) అడ్డుకుని, ఆదివాసీలకు అండగా నిలబడతామని తెలిపారు. ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు నిరాకరించడం అన్యాయమని, వారందరికీ ఎస్టీ(కోయ) పత్రాలు ఇవ్వాలన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్న ఆదివాసీలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల నిధులు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2016 నుంచి రావలసిన రూ.25 కోట్ల తునికాకు బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కో మండలంలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి పైచిలుకు ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. చదువుకున్న గిరిజన యువతీ, యువకులకు ఐటీసీ, సింగరేణి, బీటీపీఎస్, నవభారత్, కేటీపీఎస్ వంటి సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సాగు భూములకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు వీలుగా దుమ్ముగూడెం మండలంలో ప్రగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, చర్ల మండలంలో వద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తెలిపారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే ఐటీడీఏ కార్యాలయాన్ని, కలెక్టరేట్‌ని భవిష్యత్తులో ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓకి అందజేశారు. సమస్యలు పరిష్కారం చేస్తామని పీఓ హామీ ఇచ్చారు. ధర్నాకి దుమ్ముగూడెం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.