Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన చట్టంలోని హామీలేమయ్యాయి..?
- అబద్ధాలు వల్లె వేసిన ప్రధాని మోడీ
- అభాసుపాలైన అమిత్ షా...
- బీజేపీపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ నేతల దగ్గర విషం తప్ప విషయం లేదనేది పరేడ్ గ్రౌండ్ సభ సాక్షిగా మరోసారి రుజువైందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలపై అడిగితే ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని అన్నారు. అవి ఎటు పోయాయని ప్రశ్నించారు. ఆయన పచ్చి అబద్ధాలు వల్లె వేశారని విమర్శించారు. నిజాలు దాచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... తెలంగాణ ప్రజల్లో అబాసుపాలయ్యారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రేగా కాంతారావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 మంది సీఎంలు వచ్చారు... వారందరూ తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఆ సమావేశాల్లో ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి దిశా నిర్దేశం చేస్తారని భావిస్తే... అందుకు భిన్నంగా బీజేపీ నేతలు అధికార యావ చుట్టే తమ ప్రసంగాలను తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన ప్రధాని మోడీ, అమిత్ షా తమ స్థాయిని తామే తగ్గించుకున్నారని విమర్శించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను ఇస్తే... రాష్ట్రం మరింతగా దూసుకుపోయేదన్నారు. ఇలాంటి అంశాలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను సైతం బుట్టదాఖలు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని హరీశ్‌రావు ఈ సందర్భంగా విమర్శించారు. నల్లధనం తెస్తామంటూ ప్రగల్భాలు పలికిన మోడీ.. ఆ విషయంలో విఫలమాయ్యారనీ, ఆయన హయాంలో రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని తెలిపారు.