Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ల అప్పులకు తిప్పలే..
- రాష్ట్రానికి కేంద్రం షరతుల ఫలితం
- ఈ ఏడాది అప్పుల లక్ష్యం రూ.52వేల కోట్లు
- రూ.33 వేల కోట్ల అప్పు పుట్టొచ్చంటున్న అధికారులు
- ఒక్కో రాష్ట్రానికి ఒక్కోపద్ధతేంటి?: కేంద్ర వైఖరిని తప్పుపడుతున్న అధికార పార్టీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించే అప్పులకు ఈ ఆర్ధిక సంవత్సరం తిప్పలు తప్పేట్టులేదు. కేంద్ర ప్రభుత్వం మెలికతో రాష్ట్రం తీసుకోవాలనుకున్న రూ.52వేల కోట్ల అప్పులో రూ.19వేల కోట్లకి కోత పడే అవకాశం ఉంది. దాదాపుగా రూ.34 వేల కోట్ల అప్పు లభించవచ్చని ఆర్ధిక శాఖ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52,187 కోట్లను అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం బడ్జెట్లో పొందుపర్చింది. వివిధ కార్పొరేషన్ల పేరిట మరో రూ.34,873 కోట్ల గ్యారంటీ అప్పులు తీసుకోవాలని నిర్ణయించింది. కానీ... కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆంక్షల మెలిక పెట్టింది. గడిచిన రెండేళ్ల బడ్జెట్ అప్పులతో పాటు గ్యారంటీ అ ప్పులను కూడా ఎఫ్ఆర్బీఎం చట్ట నిబంధనల పరిధిలోకి తీసుకుంటామని కేంద్రం ఇదివరకే అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. పరిమితికి మించి అన్పు ఎంత ఎక్కువగా ఉంటే... అంతమేర 2022-23 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అప్పుల్లో కోతలు విధిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్ర అప్పులపై సందిగ్ధత ఏర్పడింది. ఎంతమేర అప్పు వస్తుందన్నది అంచనాలేదు. ఎఫ్ఆర్బీఎం నిబంధన మేరకు జీఎస్డీపీలో 3.5 శాతం అప్పు ప్రకారం...ఈసారి రూ.42,728 కోట్ల అప్పు తీసుకోవడానికి తెలంగాణకు అర్హత ఉంటుందని రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. కానీ... దీనినే ఫైనల్ చేయలేదు. అధికార వర్గాలు మాత్రం రూ.42 వేలకోట్లే రావొచ్చని అంటున్నాయి. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈసారి అంచనా వేసిన బడ్జెట్ అప్పులో రూ.19 వేల కోట్ల మేర తగ్గవచ్చని వివరిస్తున్నారు. అంటే అంచనా వేసిన రూ.52,167 కోట్లలో రాష్ట్రానికి ఈసారి రూ.34 వేల కోట్ల వరకు అప్పు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గ్యారంటీ అప్పులపై ఆశలు వదులుకోవాల్సిందే
ఇక గ్యారంటీ అప్పులపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ అప్పులకు దాదాపు మార్గం మూసుకుపోయిందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ప్రభుత్వం ఆశలు వదులుకోక తప్పదని అంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలు వంటి విద్యుత్తు సంస్థలకు రూ.12,198 కోట్లు, ఇరిగేషన్ కార్పొరేషన్ల పేర రూ.22,675 కోట్ల మేర గ్యారంటీ అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్ కార్పొరేషన్ల పేర తీసుకోవాలనుకున్న రూ.22,675 కోట్లు కూడా రాకపోవచ్చని అంటున్నారు. విద్యుత్తు సంస్థల పేర తీసుకునే రూ.12,198 కోట్ల అప్పు లభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. వీటికి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండడం, ప్రభుత్వం కూడా నష్ట పరిహారాన్ని చెల్లి స్తుండడంతో అప్పు పుడుతుందని చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని అధికారపార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
అప్పుల విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఏంటని కేంద్రాన్ని నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటనీ, తమ జీఎస్డీపీ బాగానే ఉందని వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఫైనాన్షియల్ కార్పొరేషన్లు జీఎస్డీపీ ఆధారంగా రాష్ట్రాలకు అప్పులు ఇస్తుంటాయి. తెలంగాణ జీఎడీపీ బాగా ఉన్నందునే సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టుకుని ఆర్బీఐ ద్వారా ఆర్థిక సంస్థలు అప్పులిస్తున్నాయి. అలాంటప్పుడు మధ్యలో కేంద్ర ప్రభుత్వ పెత్తనమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిందన్న సిఫారసును పట్టుకుని తెలంగాణపై కేంద్రం రాజకీయ కక్ష సాధిస్తుందని అధికార పార్టీ ముఖ్య నేత ఒకరు వివరించారు. పంజాబ్ వంటి రాష్ట్రాలు జీఎస్డీపీలో 60 శాతం మేర అప్పులు తీసుకుంటున్నాయని, కానీ... ఎఫ్ఆర్బీఎం నిబంధలన ప్రకారం ఏటా తెలంగాణ తీసుకుంటున్న అప్పులు 25 శాతం లోపే ఉంటున్నాయని చెప్పారు. రాజకీయంగా కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే తెలంగాణపై బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.