Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలు లేవు...
- పీఎఫ్, ఈఎస్ఐ ఊసే లేదు
- ఛిద్రమవుతున్న బతుకులు
- ఆ రంగాన్నీ కార్పొరేట్లకు అప్పగించేలా చట్ట సవరణలు
- పోరాడి సాధించుకోవాల్సిందే :
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సదస్సులో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లను ఆదాయ వనరుగా చూస్తున్నాయే తప్ప, వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు అన్నారు. వారికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ వంటి చట్టపరిధిలోని ఎలాంటి హక్కులను కల్పించకుండా, శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) 11వ జాతీయ మహాసభల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యాన మంగళవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'రవాణారంగం-సవాళ్లు-సంక్షేమబోర్డు ఆవశ్యకత' అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. గతంలో చదువు లేకుంటే ప్రత్యామ్నాయ ఉపాధిగా డ్రైవింగ్‌ను ఎంచుకునేవారనీ, ఇప్పుడు ఆ రంగంలోకి బీటెక్, ఎంటెక్ చదివిన యువకులు కూడా వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాలు వారికి ఉద్యోగాలు కల్పిస్తే, ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. శ్రమదోపిడీకి అనుకూలంగా కార్మిక చట్టాలను నాలుగు కోడ్ల రూపంలోకి కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మార్చిందని వివరించారు. కనీస వేతనాల జీవోను సవరించి పదేండ్లు అయ్యిందన్నారు. కానీ పెట్రోల్, డీజిల్‌తో పాటు రోడ్ ట్యాక్స్, లైఫ్‌ట్యాక్స్, ఇన్సూరెన్స్ సహా అన్నింటి రేట్లు పెరిగాయని గుర్తుచేశారు. కోవిడ్ టైంలో కార్పొరేట్లు బాగుపడ్డారే తప్ప, సామాన్యులకు ఒరిగిందేంటని ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నదనీ, నిన్న మొన్నటి వరకు దానికి వత్తాసు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ బకాయిల కోసం బిచ్చగాళ్ళులా కేంద్రం ముందు చేతులు చాపుతున్నారని ఆక్షేపించారు. మోటారు వాహన చట్టం-2019 లక్ష్యం రవాణారంగాన్ని ఓలా, ఊబర్ వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమేనని అన్నారు. దేశంలోని రవాణారంగంపై 2006లో వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సిఫార్సులు చేసిందన్నారు. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని విమర్శించారు. వివిధ రంగాల కార్మికులకు సంబంధించిన బోర్డుల్లో కార్పొరేట్లను చైర్మెన్లుగా నియమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ పలు ఉదాహరణలు చెప్పారు. లాభాలను ఆర్జిస్తున్న ఆయిల్ కంపెనీలు ట్యాంకర్ల డ్రైవర్లకు కనీస వేతనాలు ఇవ్వట్లేదనీ, ప్రమాదాల్లో మరణిస్తే, తమకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఆటో, లారీ, టెంపో, డీసీఎం సహా అన్ని వాహనాల డ్రైవర్ల సమస్యలు ఒకటేననీ, వాటిని సాధించుకోవాలంటే ఐక్యంగా పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని దిశానిర్దేశం చేశారు.
డ్రైవర్ల కోసం సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎం వెంకటేష్ మాట్లాడుతూ రోడ్లు బాగుంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ, నిర్వహణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. చలాన్ల పేరుతో రోడ్డు రవాణాను ఆదాయ వనరుగా మార్చారన్నారు. డ్రైవర్లకు వచ్చే ఆదాయం కంటే కట్టే చలాన్ల సొమ్మే ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కమిటీ కార్యదర్శి కే అజరుబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్టివ్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కే సతీష్, తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీ నర్సింహారెడ్డి, తెలంగాణ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నగర కార్యదర్శి మహ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.