Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్కేజీకి రూ.లక్ష ఎలా కట్టాలి?
- బుక్స్, యూనిఫాం దందాపై చర్యలు తీసుకోవాలి
- ఫీజుల నియంత్రణకు రెగ్యులేషన్ కమిటీ వేయాలి : ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, టీయూడీఎఫ్, టీపీఏ ధర్నా
నవతెలంగాణ- సిటీబ్యూరో
కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నోట్‌బుక్స్, యూనిఫాం, టై, బెల్టుల దందాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. మంగళవారం హైదరాబాద్ డీఈవో ఆఫీసు ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, టీయూడీఎఫ్, టీపీఏ సంఘాల గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అదేవిధంగా జిల్లాల్లోనూ డీఈవో కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు ధనార్జనే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఎల్కేజీ విద్యార్థుల నుంచి కూడా లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లోనే యథేచ్ఛగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, ఇతర సామగ్రిని విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ప్రతి విద్యాసంవత్సరం కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో ఎంత ఫీజు వసూలు చేయాలని 'ఫీ' రెగ్యులేటరి కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించాల్సిన ప్రభుత్వం.. అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా నేటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా స్కూళ్లలో 30-50శాతం ఫీజులు పెంచుకుని విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేస్తున్నాయని చెప్పారు. ఎల్కేజీ నుంచి ఆరవ తరగతి వరకు నోట్‌బుక్స్‌కే రూ.5-8వేలకు వసూలు చేస్తున్న ప్రయివేటు స్కూళ్ల వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. సదరు స్కూళ్ల వివరాలనూ డిప్యూటీ ఈవోలు, ఐవోఎస్‌లకు, డీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రమాణాలు, నిబంధనలు పాటించని కార్పొరేట్ బడులపై తక్షణమే చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలన్నారు. ఫీజుల నియంత్రణకు జిల్లా స్థాయిలో డీఎఫ్‌ఆర్‌సీలను వెంటనే నియమించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయివేటు స్కూళ్లవైపు మొగ్గుచూపుతున్నారనీ, మన ఊరు-మన బడి ఆర్భాటానికే పరి మితమైందనీ విమర్శించారు. స్వచ్ఛ కార్మికులను తొలగించడంతో మరుగుదోడ్లు వాడుకునే పరిస్థితి లేదని చెప్పారు. భవనాల్లో లీకేజీల కారణంగా వర్షాలు పడి పుస్తకాలు తడిసిపోతున్నాయనీ, విద్యావాలంటీర్లను భర్తీ చేయకపోవడంతో టీచర్ల కోరత ఏర్పడిందనీ తెలిపారు. అనేక సమస్యలకు నిలయంగా మారిన సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు జంకుతున్నారని, అటు చదువులేక.. ఇటు చదువు కొనలేక విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫీజులను నియంత్రించి.. ప్రయివేటులో 25శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈవో ఆర్.రోహిణికి మెమోరాండం అందజేశారు.ధర్నాలో ప్రజాసం ఘాల కార్యదర్శులు అశోక్‌రెడ్డి (ఎస్ఎఫ్ఐ), కె.నాగలక్ష్మి (ఐద్వా), జావీద్(డీవైఎఫ్ఐ), మారన్న (టీయూడీఎఫ్), సాయి శేషగిరిరావు, భాగ్యలక్ష్మి (తల్లుల సంఘం), ఏ.పద్మ, షబాన, అనూష, మల్లేష్, శ్రీనివాస్, కృష్ణ, రవి, లెనిన్, నాగేందర్, సునీల్, అజరు పాల్గొన్నారు.
జిల్లాల్లో..
పెంచిన బస్ పాస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఆదర్శ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో కరీంనగర్ డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రయివేటు స్కూల్స్ తనిఖీలను నిర్వహించకుండా విద్యాధికారి నిర్లక్ష్యం చేస్తున్నారని, అనుమతిలేని ప్రయివేటు పాఠశాల లను మూసేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.నరేష్ పటేల్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ రాజన్న ఆధ్వర్యంలో జిల్లా విద్యా అధికారికి వినతిపత్రం ఇచ్చారు.