Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దురాక్రమణలో సింగరేణి విలువైన స్థలాలు, భవనాలు
సింగరేణి వ్యాప్తంగా విలువైన స్థలాలు, క్వార్టర్స్ కబ్జాపాలయ్యాయి. మొత్తం 11 డివిజన్లలోని సుమారు 49వేల క్వార్టర్లలో.. సింగరేణి యాజమాన్యం లెక్కల్లోలేనివే 19వేలకుపైగా ఉన్నాయి. కొన్ని ఇతరుల చేతుల్లోకి పోగా, మరికొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. ప్రధాన కూడళ్లలోని స్థలాల్లో ఏకంగా కమర్షియల్ భవనాలు నిర్మించిమరీ ప్రయివేటు సంస్థలకు అద్దెకిస్తున్నారు. ఇది అక్కడి వైట్‌కాలర్ నేతలు, పలుకుబడి ఉన్న వారికి దాసోహమంటున్న అధికారుల తీరుకు అద్దం పడుతోంది. కార్మికుల క్వార్టర్లేమో పైకప్పులు శిథిలావస్థకు చేరి కొన్నింట్లో కొంతమేర కూలాయి. గోడలూ పగుళ్లు పట్టాయి. డ్రెయినేజీ సరిగా లేక, రోడ్లూ అధ్వానంగా మారి మురుగుకూపాల్లా మారాయి. అధికారుల భవన సముదాయాలు మాత్రం విశాలవంతమైన స్థలాల్లో సకల సౌకర్యాల నడుమ ఉండటం గమనార్హం.
- పలుకుబడికి అధికారుల దాసోహం
- మెయిన్‌రోడ్డులో కమర్షియల్ భవనాల నిర్మాణం
- అధికారులకేమో విశాల భవనాలు, స్థలాలు
- కార్మికులకేమో పగిలిన గోడలు, కూలిన ఇండ్లే దిక్కు!
- సింగరేణి వ్యాప్తంగా 11డివిజన్లలోనూ ఇదే పరిస్థితి..
- మొత్తం 49వేల క్వార్టర్లలో లెక్కల్లో లేనివి 19వేలకుపైనే..
- వైట్‌కాలర్ నేతల హవా...
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సింగరేణి ప్రతినిధి
1.25లక్షల మంది కార్మికులతో ఒకప్పుడు కళకళలాడిన సింగరేణి డివిజన్లలో అప్పటి కార్మికుల పోరాట ఫలితంగా యాజమాన్యం క్వార్టర్స్ నిర్మించింది. రేకుల డబ్బాల్లా.. చిన్నపాటి విస్తీర్ణంలోనే నిర్మించిన ఆ సింగిల్ బెడ్రూం ఇండ్లనూ కొంత మందికే కేటాయించింది. ఇచ్చిన ఆ క్వార్టర్స్‌కు కూడా అనేక రకాల పన్నులు వేసింది. ప్రతి కార్మికుడి జీతం బేసిక్ నుంచి 9శాతం, క్వార్టర్స్ సౌకర్యం పొందినందుకు మరో 7శాతం ఆదాయపన్ను కింద అప్పటి నుంచీ కోత విధిస్తోంది. ఆ క్వార్టర్స్ పైకప్పు రేకులు పగిలినా, గోడలు కూలినా, తలుపులు ఊడిపోయినా.. సివిల్ అధికారుల చుట్టూ తిరిగి వేసారిన కార్మికులు గత్యంతరం లేక సొంత ఖర్చులతో సరిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు.
లెక్కలో లేని 19వేల క్వార్టర్లు..
సింగరేణిలో ప్రస్తుతం 42వేల మంది కార్మికులే పని చేస్తుండగా.. 11 డివిజన్లలోని సుమారు 49వేల క్వార్టర్స్‌లో 30వేల మంది కార్మికులే ఉంటున్నారు. మిగతా 19వేల క్వార్టర్స్‌లలో కొన్ని సింగరేణియేతరుల ఆధీనంలోకి వెళ్లిపోగా.. మరికొన్ని నిరుపయోగంగా మారాయి. ఒక్క రామగుండం డివిజన్‌లోనే 1200 క్వార్టర్స్‌ల్లో కార్మికేతర్లు ఉంటుండగా.. మరో 1600 క్వార్టర్లు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఇలా పక్కనే ఉన్న బెల్లంపల్లి డివిజన్లో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లోనూ క్వార్టర్స్ కొంత మంది కబ్జాల్లో ఉండగా.. కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో సింగరేణిలోని సుమారు వెయ్యి క్వార్టర్స్ వరకూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా.. తన నియోజకవర్గ పరిధిలోని 1600 క్వార్టర్స్ కూడా స్వాధీనం చేసుకోవాలని చెన్నూర్ ఎమ్మెల్యే సింగరేణి యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
కబ్జాలో విలువైన స్థలాలు, క్వార్టర్లు
సింగరేణి ప్రాంతాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు విలువైన స్థలాలను, క్వార్టర్స్‌ను ఆక్రమించుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా ముఖ్యకూడళ్లలో కొందరు సింగరేణి విలువైన స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి మరీ అద్దెకిస్తున్న పరిస్థితి. సింగరేణి ఎస్టేట్, సెక్యూరిటీ విభాగం అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సదరు ఆక్రమణదారులకు దాసోహంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో కార్మికులు కొన్ని డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచారు.
- ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను కార్మికులకే కేటాయించాలి.
- ప్రతి కార్మికుడికీ 250 గజాల స్థలాన్ని ఇచ్చి అందులో ఇంటి నిర్మాణానికి రూ. రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
32ఏండ్లుగా పనిచేస్తున్నా.. ఇల్లు లేదు
వి.రాజమల్లు- డ్రైవర్, ఆర్జీ-1
సింగరేణిలో మా నాయన 38ఏండ్ల్లు పనిచేసి దిగిపోయిండు. నేను 32ఏండ్లుగా పనిచేస్తున్నా. ఇన్నాండ్లు వచ్చిన జీతం కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, దవాఖానాలకే సరిపోయింది. దాచుకున్నది ఏమీ లేదు. పని దిగిపోయినాక వచ్చే పైసలు గుంట భూమి కొనుక్కోవడానికి కూడా సరిపోవడం లేదు. మూడు తరాల జీవితంలో మాకు సొంత ఇల్లు లేకపాయే. కంపెనీ జాగా ఇస్తే ఓ ఇంటివాడిని అవుతా.