Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోడు సాగుదార్లపై అటవీ అధికారుల దౌర్జన్యాలను, మూగజీవాలపై దాడులను సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చోడవరం గ్రామంలో పోడు సాగుదార్లను వారి పొలాల్లోకి పోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. పొలాల్లోకి వెళ్తున్న పశువులను విపరీతంగా కొట్టారని వివరించారు. అక్కడ ఆదివాసీలు, పేదలు 2004 నుంచి సాగుచేసుకుంటున్నారని గుర్తు చేశారు. అదేజిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లోనూ సాగుదార్లను అడ్డుకున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పోడు సాగుదార్లపై దౌర్జన్యాలు చేస్తున్నారని తెలిపారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా, హక్కుపత్రాలు ఇచ్చేందుకు తీసుకున్న దరఖాస్తులను పరిశీలించకుండా ప్రభుత్వం అటవీ అధికారులతో దౌర్జన్యాలు చేయించడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఈ దాడులు, కేసులను ఆపాలనీ, అర్హత ఉన్న సాగుదార్లకు పట్టాలిచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.