Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీకి జేఏసీ వినతి
- నేడు డిమాండ్స్ డే...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలని 8 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికలు పూర్తయ్యి, కొత్త పాలకమండలి ఏర్పాటయ్యేవరకు అఫీషియల్ పర్సన్ ఇంచార్జిని నియమించాలని కోరారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్, కో కన్వీనర్లు ఎస్ సురేష్, కత్తుల యాదయ్య, కోశాధికారి డి గోపాల్, జేఏసీ సభ్యులు జీఆర్ రెడ్డి, జక్కరయ్య, ప్రకాష్ తదితరులు రిజిస్ట్రార్‌ను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీఎస్‌ను దివాలా తీయించే విధంగా పనిచేస్తూ, దాని మనుగడకే ప్రమాదకరంగా మారిన ప్రస్తుత పాలకమండలిలోని పదిమంది సభ్యులతో కమిటీ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సీసీఎస్‌లో 48వేల మంది షేర్ హౌల్డర్లు ఉంటే, ఇప్పుడు 11వేల మంది సభ్యత్వం ఉపసంహరించుకున్నారని తెలిపారు. కార్మికుల జీతాల నుంచి రికవరీ చేసిన డబ్బులను 2020 జులై నుంచి సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం చెల్లించలేదని అన్నారు. సీసీఎస్‌కు రూ.624 కోట్లు అసలు, రూ.240 కోట్ల వడ్డీ, మొత్తం రూ.864 కోట్లను యాజమాన్యం చెల్లించాల్సి ఉందని వివరించారు. 2022 జనవరి 25 నుంచి 6,300 మంది కార్మికులు సీసీఎస్ రుణాలకు దరఖాస్తులు చేసుకుంటే, ఇప్పటి వరకు వారికి చెల్లింపులు చేయలేదన్నారు. సమస్యల పరిష్కారంపై ఇప్పటికే పలుమార్లు రిజిస్ట్రార్ సొసైటీస్‌కు వినతిపత్రాలు ఇచ్చినా, ఎలాంటి చొరవ చూపకపోవడాన్ని జేఏసీ నేతలు తప్పుపట్టారు. ఈనెల 6వ తేదీ సీసీఎస్ పరిరక్షణ దినం పాటిస్తూ, కార్మికులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.