Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో బలోపేతం కోసం బీజేపీ యత్నాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్లమెంటరీ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించి ఇన్‌చార్జీలుగా కేంద్ర మంత్రులను బీజేపీ నియమించింది. దీనికి తోడు ఒక్కో పార్లమెంటరీ నియోజవర్గ ఇన్‌చార్జీగా కూడా కేంద్ర మంత్రులనే ఎంపిక చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఆ వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మూడు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక క్లస్టర్‌గా విభజించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ క్లస్టర్ ఇన్చార్జిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను బీజేపీ నియమించింది. హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, భువనగిరి క్లస్టర్ ఇన్చార్జిగా ప్రహ్లాద్ జోషిని ప్రకటించారు. మహబూబూ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండకు క్లస్టర్ ఇన్చార్జిగా మహేంద్రనాథ్ పాండే నియమితులయ్యారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలకు క్లస్టర్ ఇన్చార్జిగా కేంద్ర మంత్రి బీఎల్ వర్మ వ్యవహరించనున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాలకు పురుషోత్తం రూపాల బాధ్యులుగా వ్యవహరించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహరించనున్నారు. మెదక్ కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాలను మంత్రి ప్రహ్లాద్ జోషి ఇన్చార్జిగా పర్యవేక్షించనున్నారు. భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ కు మహేంద్ర నాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్, హైదరాబాద్ కు జ్యోతిరాధిత్య సింథియా, మహబూబాబాద్, ఖమ్మంకు బీఎల్ వర్మ ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్ గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీ, రామకృష్ణ పేర్లను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ టీమ్ పనిచేయనున్నది. చేరికల కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఆయన టీమ్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీపకుమార్ ఉన్నారు. ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా ఎ. జితేందర్‌రెడ్డి సభ్యులుగా గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శాంతికుమార్, యోగానంద్ ఉండనున్నారు. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ధర్మపురి అర్వింద్, సభ్యులుగా వివేక్, రఘునందర్రావు, స్వామిగౌడ్, ప్రకాశ్‌రెడ్డి, బాబీ అజ్మీరాను నియమించారు.