Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చౌడవరం గ్రామంలో పోడుసాగుదారులపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యానికి దిగారు. ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను ఈయేడూ సాగుచేసుకునేందుకు ప్రయత్నించగా అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది గిరిజన రైతులు గ్రామ సమీపంలో ఉన్న పోడు భూమిని 20 ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అదను చూసి మంగళవారం అరకలు కట్టి దున్నడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రైతుల వద్దకు వచ్చి అరకలను అడ్డుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చేసుకుంటున్నామని అడ్డుకోవడం సరికాదని కాళ్లవేళ్లాపడ్డారు. అయినా కనికరం లేకుండా అరకలను విప్పారు. దాంతో అడ్డుకున్న సాగుదారులపై దాడికి దిగడంతో ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. మహిళా రైతులపై మగ పోలీసులు విచక్షణ మరిచి దాడులకు పాల్పడ్డారు. పోడు భూములను దున్నవద్దని అటవీ శాఖ అధికారులు రైతులకు హెచ్చరించారు. అటవీ అధికారుల దౌర్జన్యాన్ని సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా మండల కార్యదర్శి బీరెల్లి లాజర్ ఖండించారు. పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.