Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్
- అడ్డంకుల్లేకున్నా ఆలస్యమెందుకు
- విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
- 'మన ఊరు-మనబడి'కి నిధుల కొరత
- టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రకటించాలి
- సమస్యలు పరిష్కారమయ్యేదాకా ఐక్యపోరాటం
- యూఎస్పీసీ మహాధర్నాలో వక్తల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు టీచర్లు కదంతొక్కారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌కు అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలొచ్చారు. సమస్యలు పరిష్కారం చేయాలంటూ సమరభేరి మోగించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలంటూ పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టు కేసులు, ఇతర అడ్డంకుల్లేకున్నా షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎందుకు ఆలస్యమవుతున్నదని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఖాళీలను ప్రత్యక్ష నియామకాల భర్తీ చేసేందుకు టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రకటించాలని కోరారు. ఆలస్యమైతే విద్యావాలంటీర్లను నియమించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించేంత వరకూ ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మహాధర్నాకు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, ఎం రఘుశంకర్‌రెడ్డి, యు పోచయ్య, ఎస్ హరికృష్ణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.
విద్యాశాఖలో సంక్షోభం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఉపాధ్యాయులకు నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్నతుల్లేవనీ, పదిహేడేండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కావడం లేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన ధర్నానుద్దేశించి మాట్లాడుతూ విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటం ఉపాధ్యాయుల కోసం మాత్రమే కాదన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసమని చెప్పారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త నియామకాలు చేపడితే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం బదిలీలు, పదోన్నతులకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయని అన్నారు. విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైంద న్నారు. సీఎం కేసీఆర్ గతేడాది మార్చి 22న, ఈ ఏడాది మార్చి 10న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియ చేపడతామని ఏప్రిల్ 21న ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో హామీ ఇచ్చారని వివరించారు. అయినా షెడ్యూల్ విడుదలలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు వారాలు గడిచిందని చెప్పారు. పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'మన ఊరు-మనబడి', సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారుల కొరత తీర్చాల్సిన అవసరముంద న్నారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం సర్వీస్ పర్సన్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యారంగం విధ్వంసం : హరగోపాల్
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం చేసిందని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ఎనిమిదేండ్లుగా విద్యారంగాన్ని సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని చెప్పారు. మనువాదపు ఆలోచనలు, భూస్వామ్య భావజాలంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. పేద విద్యార్థులకు చదువెందుకు?అన్న ధోరణితో ఉన్నాయని వివరించారు. పేదలు చదివితే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి తెలుసుకుని పాలకులను ప్రశ్నిస్తారనీ, ఇది వారి ఉనికికే ప్రమాదమని గ్రహించి వారిని చదువుకు దూరం చేస్తున్నా రని విమర్శించారు. యాదాద్రి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించిన కేసీఆర్, 'మన ఊరు-మనబడి'కి మాత్రం దాతలు, ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థుల నుంచి నిధులు సమకూర్చు కోవాలంటూ నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ పేదల విద్య పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎం రవీందర్, టి లింగారెడ్డి, డి సైదులు, పి రాజయ్య, బి కొండయ్య, జాదవ్ వెంకట్రావు, జాడి రాజన్న, మసూద్ అహ్మద్, శాగ కైలాసం, టి విజయసాగర్, కె బిక్షపతి, వై విజయకుమార్, ఎస్ మహేష్, ఎన్ చెన్నరాములు, ఎం రామారావు, మేడి చరణ్ దాస్, శ్రీనివాస్ నాయక్, డి రాజనర్సుబాబు, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి తదితరులు ప్రసంగించారు. పాఠశాల విద్యారంగంలో నెలకొన్న ఈ అశాంతిని నివారించకుం టే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామనీ, కలిసొచ్చే ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.