Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులపై పోలీసు నిర్భంధం ఆపాలి ొపట్టాల కోసం దశలవారి పోరాటం
- ప్రభుత్వం స్పందించకుంటే.. ప్రత్యక్ష పోరాటం : పోడు రైతు పోరాట కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నో ఏండ్లుగా పోడు భూమిపై ఆధారపడి బతుకుతున్న వారికి ఈ నెల 15నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న 'రెవెన్యూ సదస్సు'ల్లో హక్కు పత్రాలివ్వాలని పోడు రైతు పోరాట కమిటి నేతలు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన పోడు రైతు పోరాట కమిటి సమావేశం జరిగింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, సూడి కృష్ణారెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, నాయకులు ఎం హన్మేష్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, కె గోవర్దన్, న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు జె చలపతిరావు, మండల వెంకన్న, సీపీఐ(ఎంఎల్) కార్యదర్శి ప్రసాద్, టీడీపీ ప్రధాన కార్యదర్శులు రాజూనాయక్, యానానందరెడ్డి, ఇందిరా, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావ్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పోడు రైతుల పోరాటాలతో పాటు వామపక్ష, ప్రతిపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా గత ఏడాది నవంబర్‌లో పోడు రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిందని గుర్తుచేశారు. వాటిని పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వడంలో సర్కారు పూర్తిగా విఫలమయిందనీ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకపోగా.. అటవీ శాఖ అధికారులు, పోలీసుల ద్వారా పోడు రైతులపై, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిందని చెప్పారు. అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అటవీ శాఖ అధికారుల దాడులు, కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలనీ, అటవీ శాఖ సిబ్బంది దాడులు ఆపాలనీ, అక్రమ కేసులు ఎత్తేయాలని 2021 మే నుంచి నవంబర్ వరకు గిరిజన, ప్రజా సంఘాలతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ''పోడు రైతు పోరాట కమిటీ''గా ఏర్పడి పోరాటాలు నిర్వహించామని గుర్తుచేశారు. పోడు రైతు పోరాటానికి తలొగ్గిన సీఎం కేసీఆర్.. ఆ సమస్యను తక్షణం పరిష్కరిస్తామని అసెంబ్లీలో ప్రకటించారనీ తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మెన్‌గా కమిటిని వేశారన్నారు. అటవీ, రెవెన్యూ శాఖ మంత్రులతో వేసిన ఆ కమిటీ ఉత్సవ విగ్రహంగా మారిందని విమర్శించారు. 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు సాగు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారన్నారు. దరఖాస్తుల వివరాలు వెల్లడించకుండా రహస్యంగా ఎందుకుంచారని వారు ప్రశ్నించారు. గ్రామ సభల ద్వారా స్వీకరించిన వాటిని పరిశీలించటానికి ఇంకెన్ని నెలల సమయం కావాలో చెప్పాలన్నారు. ఇప్పటికే ఏడు నెలలు గడుస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల సమస్యను కావాలనే జాప్యం చేస్తున్నదని విమర్శించారు.
దాడులు.. దౌర్జన్యాలు ఆపాలి
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించకుండా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులకు పరోక్ష అధికారాలిచ్చి గిరిజనులు, పేదలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మహిళలను సైతం జైళ్లపాలు చేశారన్నారు. సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో జేసీబీలతో కందకాలు తవ్వడం, కంచెలు పాతడం, హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారని చెప్పారు. ఇదెక్కడి అన్యాయమని గిరిజనులు ఎదురుతిరిగితే.. అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి కాళ్లు చేతులు విరగోట్టడం, లాఠీచార్జీలు చేయడం అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్‌లో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్‌పై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. కామారెడ్డిలో అటవీ భూములను తరతరాలుగా సాగుచేసుకుంటున్న గిరిజనులపై దాడి చేసి లాఠీఛార్జి చేశారన్నారు. ఇది తట్టుకోలేక దనావత్ రాములు నాయక్, లక్ష్మి బాయి, రూప బాయి అనే ముగ్గురు గిరిజన రైతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని గర్తుచేశారు. మంచిర్యాల జిల్లా కోయపోశగూడ ఆదివాసీగూడెంలో పోడు భూములను సాగుచేస్తున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు దాడి చేసి తీవ్రంగా లాఠీఛార్జి చేశారని చెప్పారు. చంటి పిల్లలున్నారని కూడా కనికరం చూపకుండా 12 మంది ఆదివాసీ మహిళలను జైలుకు పంపారని తెలిపారు. ఏడు రోజులపాటు జైల్లో ఉన్నారనీ ,ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో అటవీ అధికారులు దాడులు చేసి తలలు పగల గొట్టారని గుర్తుచేశారు.
ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంశాలు..
1) పోడు సాగుదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్వీకరించిన దరఖాస్తులను తక్షణం పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలి. 2) సమస్యను పరిష్కరించేవరకు పోడు భూముల్లో అటవీశాఖ అధికారుల జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వాలి. 3) పోడు సాగుదారుల నుంచి ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నారో జిల్లాల వారీగా ప్రకటించాలి. 4) పోడు సాగుదారులపై అటవీశాఖ, పోలీసులు చేస్తున్న దాడులను తక్షణం ఆపాలి. 5) గిరిజనులు, పేదలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
ఉద్యమ కార్యాచరణ..
జులై 11 నుంచి గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోడు సమస్యపై వేసిన మంత్రుల కమిటీ చైర్మెన్, గిరిజన, అటవి శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇవ్వాలి. 15వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'రెవెన్యూ సదస్సు'ల్లో పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని మంత్రులకు మెమోరాండాలివ్వాలి. ఆగస్టు తొమ్మిదో తేదీ లోపు పోడు భూములకు హక్కు పత్రాలివ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సిద్దం కావాలనీ, ఆ తర్వాత పోడు ప్రాంతాల్లో 'బంద్' నిర్వహించాలని పిలుపునిచ్చారు.